టీమిండియాగా పనిచేసి గడ్డు కాలాన్ని అధిగమిద్దాం!

టీమిండియాగా పనిచేసి గడ్డు కాలాన్ని అధిగమిద్దాం!
* లాక్‌డౌన్ విధించాలనే ఆలోచనే లేదు.. సీఎంలకు ప్రధాని స్పష్టం 

పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా దేశంలో లాక్‌డౌన్ విధించబోతున్నారనే వార్తలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ లాక్‌డౌన్ విధించాలనే ఆలోచనే తమకు లేదని ప్రధాని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో అత్యున్నత స్థాయి వర్చువల్ సమావేశం నిర్వహించిన మోదీ ఎల్పీజీ, పెట్రోల్, ఎరువుల కొరతపై ఆరా తీశారు. 

ఈ సందర్భంగా వ్యాపార స్థిరత్వం, ఇంధన భద్రతపై ఎల్జీ, సీఎంలకు కీలక సూచనలు చేసిన ప్రధాని టీమిండియాగా పనిచేసి ఈ గడ్డు కాలాన్ని అధిగమిద్దామని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో మాదిరిగానే ఈ కఠినమైన పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాగా పనిచేస్తూ అధిగమిద్దామని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. అయితే, తమిళనాడు, బంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఆయా రాష్ట్రాల సీఎంలకు బదులు సీఎస్‌లు సమావేశంలో పాల్గొన్నారు.

పశ్చిమాసియా ఘర్షణల కారణంగా తలెత్తిన ప్రపంచ పరిస్థితి నిరంతరం మారుతూనే ఉందని చెబుతూ ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడం, ఇంధన భద్రతను నిర్ధారించడం, పరిశ్రమలను, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం వంటివి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయని ఆయన ప్రకటించారు.

కేంద్రం, రాష్ర్టాల మధ్య నిరంతరం సమాచార మార్పిడి, సమన్వయం జరగాలని ఆయన పిలుపునిస్తూ సకాలంలో సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రతిస్పందనలు వేగవంతంగా జరిగేలా చూడాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి అదే సహకార, సమన్వయ స్ఫూర్తి భారత్‌కు గొప్ప బలమని ప్రధాని చెప్పారు.

గ్యాస్, పెట్రోల్, ఎరువుల సరఫారాపై ఆరా తీసిన ప్రధాని పరస్పర సహకారం, సత్వర స్పందనతో వ్యవహరించాలని కోరారు. మార్చి ఆరంభం నుంచి యుద్ధం పర్యావసానాలను మంత్రుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పిన ప్రధాని ఈ సమయంలో ఆర్ధిక, వాణిజ్య స్థిరత్వం, ఇంధన భద్రతకు ప్రాధాన్యమివ్వాలని కీలక సూచనలు చేశారు.  అంతర్జాతీయంగా కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ పౌరుల ప్రయోజనాలను కాపాడడం, పరిశ్రమలు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని సీఎంలకు ప్రధాని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళికల అవసరం ఉందని చెప్పిన మోదీ  ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత ఏర్పడకుండా చూడాలని తెలిపారు.  ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. తీర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రధాని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వందతులపై అప్రమత్తంగా ఉండాలని మోదీ తెలిపారు. ఆన్‌లైన్ మోసాలు, తప్పుడు, నకిలీ ఏజెంట్ల మీద నిఘా పెట్టాలని సీఎంలకు మోదీ సూచించారు.

రాజ్‌నాథ్ నేతృత్వంలో అనధికారిక మంత్రుల బృందం

మరోవైపు పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనధికారిక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కీలక బృందంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి సభ్యులుగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.