* ఇజ్రాయెల్‌ను జవాన్ల కొరత
ఒక వంక పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ మధ్యవర్దులుగా అమెరికా- ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తుదనగా, అమెరికా, ఇజ్రాయెల్‌లతో భూతల యుద్ధం జరగవచ్చని ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో 10 లక్షల మందికిపైగా యోధులను ఇరాన్ సమీకరించినట్లు తెలిసింది. ఈ 10 లక్షల మందిలో సైనిక సిబ్బంది, వలంటీర్లు ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ తాస్నిం వార్తాసంస్థ తెలిపింది.
ఇజ్రాయెల్‌కు 12 వేల మంది సైనికుల కొరత
ఇరాన్‌తో భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ను జవాన్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఆ దేశ ఆర్మీ చీఫ్ జమీర్ స్వయంగా గురువారం జరిగిన సెక్యూరిటీ క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొన్నది. ‘మీ ముందు నేను పది ఎర్ర జెండాలు (తీవ్ర ప్రమాద పరిస్థితులు) ప్రదర్శిస్తున్నా’ అని ఆయన మంత్రులకు చెప్పినట్టు చానెల్ 13 న్యూస్ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నిర్బంధ సైనిక సేవా చట్టం, రిజర్వ్ డ్యూటీ చట్టం, తప్పనిసరి సేవను పొడిగించే చట్టం అమలు కావాలని జమీర్ కోరినట్టు సమాచారం. మూడేండ్ల క్రితం గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 12 వేల మంది సైనికుల కొరత ఐడీఎఫ్‌ను వేధిస్తున్నది. ఇదే విషయమై ఆ దేశ విపక్ష నాయకుడు యైర్ లపిడ్ గురువారం ఇజ్రాయెల్ సర్కార్‌ను తీవ్రంగా విమర్శించారు.
గాయపడ్డ సైనికులను యుద్ధ క్షేత్రంలో అలాగే వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ ఆవిర్భావం నుంచి సైనిక సేవకు మినహాయింపు పొందిన అతి సంప్రదాయ వాద హరేడి వర్గ పురుషులను సైన్యంలో చేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చిమాసియాకు 10,000 మంది అమెరికా సైనికులు!
మరోవంక, పశ్చిమాసియాకు అదనంగా 10,000 బలగాలను పంపాలని అమెరికా యోచిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌లో గురువారం వెలువడిన వార్తను ఉటంకిస్తూ జెరూసలెం పోస్టు పేర్కొన్నది. ఇప్పటికే పశ్చిమాసియాలో నియమించిన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ బలగాలకు అదనంగా ఇన్ఫాంట్రీ, సాయుధ వాహనాలను పంపాలని అమెరికా భావిస్తున్నట్లు యుద్ధ శాఖ అధికారులను ఉటంకిస్తూ జెరూసలెం పోస్టు తెలిపింది.
ఖర్గ్ ద్వీపం వంటి ఇరాన్ వ్యూహాత్మక ప్రయోజనాలను నేరుగా లక్ష్యం చేసుకుని 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌ను మోహరించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. బలగాల మోహరింపునకు సంబంధించి అన్ని ప్రకటనలు యుద్ధ శాఖ నుంచి వస్తాయని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ చెప్పారు. సైనిక ప్రత్యామ్నాయలన్నిటిపై తుది నిర్ణయం అధ్యక్షుడు ట్రంప్‌దేనని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

More Stories
పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీ రాముడు
టీమిండియాగా పనిచేసి గడ్డు కాలాన్ని అధిగమిద్దాం!
రూ. 2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాల కొనుగోలు