ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ, ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం దేశంలోని క్రికెట్ అభిమానులకు ఊరటనిచ్చింది. భారత్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు నిరీక్షిస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. రెహమాన్ తారీఖ్ సారథ్యంలోని కొత్త సర్కార్ ఐపీఎల్ ప్రసారాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.
ఆ దేశ సమాచార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వప్నన్ ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించారు. క్రీడలను రాజకీయాలతో కలపడం తమ ఉద్దేశం కాదని తెలిపారు. ఐపీఎల్ ప్రసారాలను పూర్తిగా వాణిజ్యపరంగా పరిగణిస్తామని, ప్రసార హక్కుల కోసం ఏదైనా ఛానెల్ దరఖాస్తు చేస్తే అనుకూలంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లు ప్రసారం చేయడంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
“ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయాలని ఏ ఒక్క టీవీ ఛానెల్ యాజమాన్యం మాకు దరఖాస్తు ఇవ్వలేదు. రాజకీయాలతో క్రికెట్‌ను ముడిపెట్టడం మాకు నచ్చదు. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం అంశాన్ని మేము వాణిజ్య కోణంలో చూస్తున్నాం. ఏ ఛానెల్ వారైనా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాల అనుమతి కోరితే.. మేము అంగీకరిస్తాం. మేము ఎవరినీ ఐపీఎల్ ప్రసారం చేయకుండా అడ్డుకోం. స్టార్ స్పోర్ట్స్ సంస్థ ప్రసారం చేయాలనుకుంటే వారికి అభ్యంతరం చెప్పం. అలాగనీ కచ్చితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయాలని మేము ఎవరినీ బలవంతం చేయం” అని మీడియా సమావేశంలో జహీర్ ఉద్దీన్ వెల్లడించారు.
బంగ్లాదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ప్రసారాలను నిలిపివేయాలని తమకు ఎలాంటి తాజా ఆదేశాలు లేవని, స్టార్ స్పోర్ట్స్ వంటి ఛానెల్‌లు ఐపీఎల్‌ను ప్రసారం చేస్తే అవి నిరంతరంగా కొనసాగుతాయని వెల్లడించింది. గత ఏడాది బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ పై బీసీసీఐ వేటు వేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.
తమ పేసర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై ఆగ్రహించిన మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలపై నిషేధం విధించింది. అంతేకాదు.. భద్రతా కారణాలతో భారత్‌లో పొట్టి ప్రపంచకప్ ఆడబోమని ఐసీసీకి తేల్చి చెప్పింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఐసీసీ బృందం చర్చించినా మాట వినని బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు అవకాశమిచ్చింది.

More Stories
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఇక లేనట్టే!
నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటంలో మెటా విఫలం