రూ. 2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాల కొనుగోలు

రూ. 2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాల కొనుగోలు

* రష్యా నుంచి ఐదు ఎస్-400‌లు, 60 సైనిక రవాణా విమానాలు

భారతదేశం రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకొనే దిశగా ఆధునిక పరిస్థితులకు తగ్గట్టుగా సైనిక అవసరాల కోసం భారీగా యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) ఆమోదం తెలిపింది. రూ.2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాలను కొనేందుకు రక్షణ శాఖకు అనుమతి లభించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త విమానాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదన (యాక్సెప్టన్స్ ఆఫ్ నెస్సెసిటీ)కు డీఏసీ అంగీకరించింది. దాంతో, సైన్యం, వాయుసేన, కోస్ట్ గార్డ్‌ విభాగానికి అవసరమైన యుద్ధ విమానాలను కొనే ప్రక్రియ వేగవంతం కానుంది.

“ఈరోజు డీఏసీ సమావేశానికి అధ్యక్షత వహించాను. ఈ సందర్భంగా సైన్యం అవసరాల నిమిత్తం రూ.2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాల కొనుగోలుకు అమోదం లభించింది. డీఏసీలో తీసుకున్న ఈ నిర్ణయం భారత దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయనుంది. భారత సైన్యంకోసం ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్, ఆర్మౌర్డ్ పియెర్సింగ్ ట్యాంక్ అమ్మునిషన్, అత్యధిక సామర్ధ్యం కలిగిన రేడియో రీలే, ధనుష్ గన్ వ్యవస్థ, స్వతంత్ర నిఘా వ్యవస్థతో కూడిన రన్‌వే.. వంటి వాటికి డీఏసీలో ఆమోదం లభిచింది” అని రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ పోస్ట్‌లో పోస్ట్ చేశారు. 

2025-26 ఆర్ధిక సంవత్సరంలో  రక్షణ శాఖకు సంబంధించిన ఆమోదాలు, ఒప్పందాలు రికార్డు స్థాయికి చేరాయని ఆయన తెలిపారు.ఇప్పటివరకూ రూ.6.73 లక్షల కోట్ల ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. భారత సైన్యం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాతకాలపు ఏఎన్32, ఏఎల్76 యుద్ధ విమనాల స్థానంలో మధ్య తరహా రవాణా యుద్ధ విమనాలు రాబోతున్నాయి. 

గగనతల మిసైల్ వ్యవస్థ పటిష్టం కోసం రష్యాకు చెందిన ఎస్‌-400 విమానాలు కొనేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది. వీటి సాయంతో అధునాతన గగనతల దాడుల ముప్పును సమర్ధంగా ఎదుర్కోవడం, సంక్షిష్టమైన లక్ష్యాలను ఛేదించడం సాధ్యపడనుంది. రిమోటెడ్ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ సు-30 ఏరో ఇంజన్ అగ్రిగేట్స్‌ కూడా భారత సైన్యం అమ్ములపొదిలో చేరనున్నాయి.

ఎస్-400 దీర్ఘశ్రేణి ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి (ఎస్ఎఎం) వ్యవస్థను కొనుగోలు చేయడానికి, సుఖోయ్ సు-30 ఏరో ఇంజిన్ భాగాలను పునరుద్ధరించడానికి, ఎఎన్32, ఐఎల్76 రవాణా విమానాల స్థానంలో మధ్య తరహా రవాణా విమానాలను ప్రవేశపెట్టడానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఐఎఎఫ్ “వ్యూహాత్మక, యుక్తి, కార్యాచరణ వైమానిక రవాణా” అవసరాలను తీర్చడమే దీని లక్ష్యం. 

“ఎస్-400 వ్యవస్థ కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని శత్రువు ప్రయోగించే దీర్ఘశ్రేణి వైమానిక దాడులను ఎదుర్కొంటుంది. అదే సమయంలో రిమోట్లీ పైలటెడ్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఆర్ఎంపిఐ) ఎదురుదాడి, సమన్వయ వైమానిక కార్యకలాపాలను చేపట్టడానికి వీలు కల్పిస్తుంది, అలాగే స్టెల్త్ ఇంటెలిజెన్స్, నిఘా మరియు గుర్తింపు కార్యకలాపాలను కూడా అందిస్తుంది,” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కోస్ట్ గార్డ్ విషయానికొస్తే హెవీ డ్యూటీ ఎయిర్ కుషన్ వెహికిల్స్‌ కొనుగోలకు డీఏసీ పచ్చజెండా ఊపింది. ఈ వాహనాలు తీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహణకు, వెతకడాని, సహాయక చర్యలు చేపట్టేందుకు తోడ్పడుతాయి.