ఇరాన్‌ ఇంధన కేంద్రాలపై దాడులు మరో 10 రోజులు నిలిపివేత

ఇరాన్‌ ఇంధన కేంద్రాలపై దాడులు మరో 10 రోజులు నిలిపివేత
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల గడువును ఇరాన్ అభ్యర్థన మేరకు మరో 10 రోజులు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రకటించారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.  ట్రంప్ చెప్పిన ప్రకారం ఏప్రిల్ 6, రాత్రి 8 గంటల వరకు ఈ గడువు అమల్లో ఉండనుంది.
ఇరాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు, శాంతి చర్చలకు మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో గడువును పొడిగింంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు.  కాగా, ఇరాన్‌తో చర్చలు విఫలమవుతున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అవి ‘ఫేక్ న్యూస్’గా కొట్టిపారేశారు. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయంపై ట్రంప్ తన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ఏప్రిల్ 6 వరకు ఇరాన్ ఎనర్జీ గ్రిడ్‌లపై ఎటువంటి బాంబు దాడులు చేయకూడదని ఆయన ఆదేశించారు. అయితే, ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం ఏప్రిల్ 6 రాత్రి తర్వాత అమెరికా సైన్యం ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది.  ఇరాన్ ప్రభుత్వం వారి దౌత్య ప్రతినిధుల ద్వారా మరో 7 రోజుల సమయం కోరినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే, తాను మాత్రం ఉదారతతో ఆ గడువును 10 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. 
 
ఇరాన్ తన ఇంధన కేంద్రాలు, చమురు నిల్వలపై దాడులను తప్పించుకోవాలంటే చర్చలు ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. లేకపోతే వారి ఇంధన కేంద్రాలు నేలమట్టం అవుతాయని హెచ్చరించారు. అయితే గడువు పెంపునకు గల మరో కారణాన్నిట్రంప్ వెల్లడించారు. హార్ముజ్ జలసంధి గుండా ఎనిమిది చమురు నౌకలను వెళ్లేందుకు ఇరాన్ అనుమతించిందని, దీన్ని అమెరికాకు ఇచ్చిన ‘కానుక’గా ట్రంప్ అభివర్ణించారు.
 
కాగా, మార్చి 2 నుండి లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,116 మంది మరణించగా, మరో 3,229 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. వీరిలో కనీసం 121 మంది చిన్నారులు, 42 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని తెలిపింది.