లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ బాధితులు అమెరికా ప్రభుత్వం, గూగుల్‌పై దావా వేశారు. న్యాయశాఖ (డిఒజె) ఆన్లైన్లో ప్రచురించిన పత్రాల్లో బాధితుల గుర్తింపులు వెల్లడవడంపై బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఎప్స్టీన్పై జరిపిన దర్యాప్తుకు సంబంధించి, ప్రముఖ వ్యక్తులతో అతనికి వున్న సంబంధాలతో సహా మూడు మిలియన్లకు పైగా పైళ్లను జనవరిలో న్యాయశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ ఫైల్స్‌లో గోప్యంగా ఉంచాల్సిన బాధితుల పేర్లు బహిర్గతం కావడంపై అధికారులు ఇబ్బందులకు గురయ్యారు. దోషిగా తేలిన లైంగిక నేరగాడు ఎప్స్టీన్ బాధితుల్లో సుమారు 100మందిని న్యాయశాఖ బహిర్గతం చేసింది. ”వారి వ్యక్తిగత సమాచారాన్ని ప్రచురించి, వారిని ప్రపంచానికి బహిర్గతం చేసింది” అని బాధితులు తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు ఆ ఫైళ్ళలో, వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపించే డజన్ల కొద్దీ నగ్న చిత్రాలను కూడా గుర్తించారు.
ఆ సమాచారాన్ని బహిర్గతం చేయడం బాధితుల హక్కులను ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం అంగీకరించి, తొలగించినప్పటికీ, గూగుల్ వాటిని నిరంతరం పున:ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. వాటిని తొలగించాలన్న తమ విజ్ఞప్తులను తిరస్కరించారని పేర్కొన్నారు.
బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ తన సెర్చ్ ఇంజన్లో, ఎఐ రూపొందించిన కంటెంట్‌లో ప్రదర్శిస్తూనే ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ”బాధితులు ఇప్పుడు మళ్లీ మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారు. అపరిచితులు వారికి ఫోన్స్ చేస్తున్నారు. ఈ మెయిల్ చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. వాస్తవానికి వారు బాధితులు అయినప్పటికీ, ఎప్స్టీన్తో కలిసి కుట్ర పన్నారని వ్యాఖ్యానిస్తున్నారు” అని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ప్రభుత్వం 1974నాటి గోప్యతా చట్టాన్ని ఉల్లంఘించిందని, గూగుల్ గోప్యతా ఉల్లంఘన సహా నిర్లక్ష్యంగా వ్యవహరించి మానసిక క్షోభకు గురిచేయడం, చట్టవిరుద్ధమైన వాణిజ్య విధానాలతో కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘించిందని బాధితులు పేర్కొన్నారు. డిఒజె విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్‌లో ముఖాలతో ఉన్న పలువురి నగ ఫొటోలను గుర్తించినట్లు న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు కూడా స్పష్టం చేశారు.

More Stories
ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు మరో 10 రోజులు నిలిపివేత
భారత్ తో సహా ఐదు దేశాల నౌకలకే ఇరాన్ అనుమతి
ఇరాన్ నౌకాదళ అధిపతి తంగ్సిరి వైమానిక దాడిలో మృతి