* శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణస్వీకారం చేశారు. 35 ఏళ్ల బాలేంద్ర షా ఆ దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అధ్యక్ష భవనమైన శీతల్ నివాస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ బాలేంద్ర షాతో 43వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం శుకృవారం ఉదయం బాలేంద్ర షాను నియమించిన అనంతరం నేపాల్ రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ బాలేంద్ర షా చేత ప్రధానిగా ప్రమాణం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రామ్ సహాయ ప్రసాద్ యాదవ్, ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ మాన్ సింగ్ రౌత్, జాతీయ అసెంబ్లీ ఛైర్మన్ నారాయణ్ ప్రసాద్ దహల్, మాజీ ప్రధాన మంత్రులు, ఉన్నతాధికారులు, సెక్యూరిటీ చీఫ్స్, దౌత్య వర్గాల సభ్యులు హాజరయ్యారు. ర్యాప్ సంగీత కళాకారుడైన బాలేంద్ర షా ‘బాలెన్’గా ప్రసిద్ధి చెందారు. తన సంగీతం ద్వారా నేపాల్‌లోని పరిస్థితులపై ప్రజల్లో అవగాహన పెంచి అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు.
అవినీతి, సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్‌లో జెన్ జీ తిరుగుబాటు అనంతరం మొదటిసారిగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అఖండ విజయం సాధించింది. బాలేంద్ర షాకు ముందు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి పనిచేశారు. బాలేంద్ర 2022లోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నేపాల్ రాజధాని కాఠ్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
కాగా, నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలెన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. “మీ నియామకం అనేది మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. మన రెండు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం, భారత్-నేపాల్ మైత్రిని, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి, మీతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు.
2025 సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. దీంతో దేశ యువతలో ఆగ్రహం పెరిగింది. జెన్ జీ యువత నిరసనకు దిగారు. సెప్టెంబర్ 9 నాటికి ఈ నిరసనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. నిరసనకారులు పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రధాని కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. 2025 సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.
సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఈ ఉద్యమంలో సుమారు 76 మంది మరణించారు. నేపాల్ చరిత్రలో అతిపెద్ద యువజన ఉద్యమంగా ఇది నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 2025 డిసెంబరు 28న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో బాలేంద్ర షా చేరారు. 2026 మార్చి 5న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనే ప్రధాన మంత్రి అభ్యర్థిగా బాలేంద్ర పేరును పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో జెన్ జీ మద్దతుతో బాలెన్ నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘనవిజయం సాధించింది.
నాలుగుసార్లు నేపాల్ ప్రధానిగా వ్యవహరించిన కేపీ శర్మ ఓలిని ఝాపా-5 నియోజకవర్గంలో బాలెన్ భారీ మెజారిటీతో ఓడించి సంచలనం సృష్టించారు. దేశంలోని 275 ఎంపీ స్థానాలకుగానూ 182 సీట్లను కైవసం చేసుకుంది. నేపాల్ రాజ్యాంగం ప్రకారం, 275 ఎంపీ స్థానాలకుగానూ 165 సీట్లలో ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించారు. మిగతా 110 సీట్లలో నైష్పత్తిక ఓటింగ్ ప్రకారం అభ్యర్థులను ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన నేపాలీ కాంగ్రెస్‌కు 38 సీట్లు, సీపీఎన్ – యూఎంఎల్‌కు 25, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి 17, శ్రమ్ సంస్కృతి పార్టీకి 7, రాష్ట్రీయ ప్రజాాతంత్ర పార్టీకి 5 సీట్లే వచ్చాయి. కోర్టు కేసు వల్ల ఒక స్థానంలో ఎన్నికల ఫలితాన్ని పెండింగ్‌లో ఉంచారు.

More Stories
అమెరికా ప్రభుత్వం, గూగుల్‌పై ఎప్స్టీన్ బాధితులు దావా
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు మరో 10 రోజులు నిలిపివేత