ఆపరేషన్ సిందూర్​పై వివేక్ అగ్నిహోత్రి సినిమా

ఆపరేషన్ సిందూర్​పై వివేక్ అగ్నిహోత్రి సినిమా

బాలీవుడ్ సంచలన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, ఈసారి భారత సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘ఆపరేషన్ సిందూర్’ కథను వెండితెరపైకి తీసుకురాబోతున్నారు.  అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి నిర్మిస్తే బాగుంటుంది కానీ, దర్శకత్వ బాధ్యతలు మాత్రం ఆదిత్య ధర్‌కు అప్పగించాలని నెటిజన్లు పెద్ద ఎత్తున కోరుతున్నారు.  ఈ సినిమా లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ‘టైనీ’ ధిల్లాన్ రాసిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్థాన్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది.  2025 మే నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

తన బ్యానర్ ‘ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్’, భూషణ్ కుమార్ ‘టి సిరీస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి అధికారికంగా వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిశోధనతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. “ది కాశ్మీర్ ఫైల్స్”, “ది తాష్కెంట్ ఫైల్స్”, “ది బెంగాల్ ఫైల్స్” వంటి చిత్రాలతో పేరుగాంచిన అగ్నిహోత్రి, అసౌకర్యంగా ఉన్నా అవసరమైన కథలను చెప్పడాన్ని తాను ఎల్లప్పుడూ నమ్ముతానని పేర్కొన్నారు. 

ధైర్యం, వృత్తి నైపుణ్యం,  వ్యూహాత్మక స్పష్టతతో కూడిన ఈ కథను ప్రామాణికతతో ప్రేక్షకులకు అందించడం, అదే సమయంలో దానిని ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టే సినిమా అనుభవంగా ప్రదర్శించడం నా ప్రయత్నం. గందరగోళం సృష్టించడం నా ఉద్దేశ్యం కాదు, వాస్తవాలతో, స్పష్టతతో, సినిమా మాయాజాలంతో దానిని ఎదుర్కోవడమే నా లక్ష్యం” అని వివరించారు.

“కొన్ని కథలు మనం ఎంచుకోము, అవే మనల్ని ఎంచుకుంటాయి. ఆపరేషన్ సింధూర్ అలాంటి ఒక కథే—దీనిని నిజాయితీ, ధైర్యం, బాధ్యతలతో చెప్పాలి. ఇది కేవలం ఒక సినిమా కాదు. ఇది ఒక సంచలనం. ఒక దేశం ఇంతటి భారీ సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు, వాటిని యథార్థంగా నమోదు చేయడం చాలా ముఖ్యం,” అని భూషణ్ కుమార్ తెలిపారు.

2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి పాల్పడిందని భారత్ ఆధారాలతో సహా నిరూపించింది. దీనికి దీటుగా సమాధానం చెప్పేందుకు భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సీరియస్ సైనిక చర్యనే ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా వాస్తవాలను ప్రపంచానికి చాటిచెప్పడమే తన ఉద్దేశమని వివేక్ అగ్నిహోత్రి చెబుతున్నారు.