మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో మరో 22 మంది తీవ్రంగా గాయపడగా, వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.  ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. 
పలకల క్వారీల వద్ద టిప్పర్‌ – ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి.
ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి పామూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రైవేటు బస్సు హరేకృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వీరు కనిగిరి, పామూరు వాసులుగా గుర్తించారు. 3 అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.

మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి 10 మంది ప్రయాణికులు హుటాహుటిన దిగిపోయారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలిని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆరా తీశారు. అదే విధంగా క్షతగాత్రులను తక్షణమే వైద్యసేవలకు తరలించేందుకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.

ప్రమాదానికి బస్సు కండిషన్​ సరిగా లేకపోవడమే కారణమని ప్రయాణికులంటున్నారు. అంతేకాకుండా యర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సును నిలిపివేసి సిబ్బంది మరమ్మతులు చేశారని తెలిపారు. ఇదిలావుంటే ప్రమాద సమయంలో బస్సు స్టీరింగ్‌ స్ట్రక్‌ అయిందని డ్రైవర్‌ చెబుతున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  బుధవారం సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణలోని జగిత్యాల నుంచి పామూరుకు బస్సు బయల్దేరింది.

ఈ క్రమంలో చీమకుర్తి నుంచి కంకర్‌ లోడ్‌తో మార్కాపురం వైపు టిప్పర్‌ వస్తుండగా ఉదయం 6 గంటల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.  తెలంగాణ నుండి కనిగిరికి పుట్టింటికి వస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఏడు నెలల గర్భిణి రుక్కు (25) మృతి చెందింది. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వడంతో, ఆమె కడుపులో ఉన్న బిడ్డతో సహా సజీవదహనమైంది.

 మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదస్థలం నుంచి సీఎంతో ఎస్పీ  హర్షవర్దన్‌రాజు ఫోనులో వివరాలను తెలిపారు. ఆపై గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. మర్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు మంత్రులు అనిత, జనార్థన్ రెడ్డితోపాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్ తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

 
మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.