అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని మోదీ భేటీ

అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని మోదీ భేటీ

ఇరాన్ యుద్ధం, సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది.  పశ్చిమాసియా యుద్ధం ప్రపంచంతోపాటు ఇండియాను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలో చమురు కొరత సహా అనేక ఇబ్బందులు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై మోదీ చర్చిస్తారు.  ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మాట్లాడారు. కరోనా కాలం నాటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ పరిస్థితులు, దాని ప్రభావం గురించి బుధవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఇంధన భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదని ఈ సందర్భంగా కేంద్రం వివరించింది.

ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం, తగిన ప్రణాళికలు రూపొందించడం, సరఫరా మార్గాలు, చమురు భద్రత, విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. రాష్ట్రాలు, కేంద్రం సమన్వయం, పరస్పర సహకారంతో టీమ్‌ ఇండియాగా, ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  యుద్ధం మొదలైనప్పటి నుంచి అనేక దేశాల నాయకులతో తాను మాట్లాడానని, నిరంతరం చర్చలు జరుపుతున్నామని ప్రధాని వివరించారు.

పశ్చిమాసియా యుద్ధం ప్రభావం భారత్‌పై వీలైనంత తక్కువగా ఉండేలా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. అందుకు మన ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉండటమే కారణమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్తితుల్ని ఎదుర్కోవడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక స్థిరత్వం సాధించడంపై సమావేశం ఉంటుంది.

అయితే, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు సంబంధించి సీఎంలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటమే ఇందుకు కారణం.  ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లు ప్రత్యేకంగా సమావేశమవుతారు. కేంద్రం తీసుకోబోయే చర్యలను అధికారులకు వివరిస్తారు. దేశంలో తాజా పరిస్థితులపై ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.