దేశంలో సరిపడా ఇంధన నిల్వలు- ఎవరూ భయపడొద్దు

దేశంలో సరిపడా ఇంధన నిల్వలు- ఎవరూ భయపడొద్దు
భారత్‌లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు బుధవారం తెలిపాయి. అనవసరంగా భయపడి ఇంధనాన్ని కొనుగోలు చేయొద్దని స్పష్టం చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత ఏర్పడిందని ఊహాగానాలు వచ్చాయి. దీంతో మెట్రో నగరాలు, పలు సిటీల్లో ప్రజలు భయాందోళనతో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇంధన నిల్వలపై తాజాగా స్పష్టత ఇచ్చాయి.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ (సోషల్ మీడియా)లో వస్తున్న వదంతులు ప్రజల్లో అనవసరమైన ఆందోళనను సృష్టించి, సాధారణ సరఫరా సరళికి అంతరాయం కలిగిస్తాయని పేర్కొంది. ఇండియన్‌ ఆయిల్ అవుట్‌లెట్లలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించింది.

తమ అవుట్‌లెట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రజలు భయపడి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు చేయడం మానుకోవాలని సూచించింది. ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.  దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత వార్తలు పూర్తిగా నిరాధారమైనవని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తెలిపింది. 

దేశంలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. సరఫరా గొలుసులు సాధారణంగా నడుస్తున్నాయని వెల్లడించింది. నిరంతరాయ ఇంధన సరఫరాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సైతం ఇంధన కొరత గురించి వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని వినియోగదారులకు హామీ ఇచ్చింది. 

“ప్రియమైన వినియోగదారులారా, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత లేదు. ఇంధన సరఫరాలు స్థిరంగా ఉన్నాయి. సరిపడ్డా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు వదంతులను పట్టించుకోవచ్చు. భయాందోళనలకు గురై కొనుగోళ్లు చేయవద్దని సూచిస్తున్నాం. దయచేసి సాధారణ వినియోగ పద్ధతులను కొనసాగించండి. హెచ్‌పీసీఎల్ తన నెట్‌వర్క్ అంతటా నిరంతరాయ, నిరాటంకమైన ఇంధన సరఫరాను నిర్ధారించడానికి కట్టుబడి ఉంది. ” అని హెచ్‌పీసీఎల్ ప్రకటన విడుదల చేసింది.
 
కాగా, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగవు అని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. పెట్రోల్‌,  డీజిల్‌ ధరలు పెరుగుతాయనే పుకార్లు నమ్మవద్దని ఆమె కోరారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22 వేల టన్నుల వాణిజ్య ఎల్‌పిజిని కేటాయించామని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్‌జి కనెక్షన్లు మంజూరు చేశామని సుజాత శర్మ తెలిపారు.