ఎవరూ చర్చించని ‘డచ్ డిసీజ్’, కొద్దిమందే సిద్ధంగా `ఏఐ తుఫాను’

ఎవరూ చర్చించని ‘డచ్ డిసీజ్’,  కొద్దిమందే సిద్ధంగా `ఏఐ తుఫాను’
 
వీరపనేని రాజేష్, డల్లాస్ 

* తరాల కూడలిలో నిలబడిన కోస్తా ఆంధ్ర కుటుంబాల కోసం ఒక ప్రవాస భారతీయుడి ఆత్మపరిశీలన 
 
నేను ఇటీవల కనకదుర్గమ్మ మహాకుంభాభిషేకం సమయంలో కోస్తా ఆంధ్రాలో పర్యటించాను. ఎప్పటిలాగే, నా పర్యటనలో మా మావయ్య డాక్టర్ యలమంచిలి శివాజీ గారితో కొంత సమయం గడిపాను. ఆయనతో కూర్చున్న ప్రతిసారీ, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, వ్యవసాయం, కోస్తా ఆంధ్ర సామాజిక ముఖచిత్రంపై ఆయనకు ఉన్న అవగాహన నన్ను ఆశ్చర్యపరుస్తుంది. 
 
ఈ పర్యటనలో ఒక సంభాషణలో ఆయన ‘డచ్ డిసీజ్’ అనే పదాన్ని ప్రస్తావించారు. గత  మూడు దశాబ్దాలుగా కోస్తా ఆంధ్రాలో జరుగుతున్న మార్పులకు, రాబోయే ఏఐ విప్లవానికి ఇది ఎంత ఖచ్చితమైన వర్ణన అనిపించిందో ఇక్కడ వివరిస్తున్నాను.

‘డచ్ డిసీజ్’ అంటే ఏమిటి? అది మనకెందుకు ముఖ్యం?

1960లలో నెదర్లాండ్స్‌లో అపారమైన సహజ వాయువు నిక్షేపాలు బయటపడ్డాయి. దీనివల్ల దేశానికి భారీగా ఆదాయం వచ్చింది. కానీ, ఈ గ్యాస్ డబ్బు పెరగడంతో, అక్కడి సంప్రదాయ తయారీ రంగం దెబ్బతిన్నది. గ్యాస్ డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చన్న ధీమాతో, కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయడం మానేశారు. చివరకు గ్యాస్ నిక్షేపాలు తగ్గినప్పుడు, ఆ దేశం సొంతంగా వస్తువులను తయారుచేసే సామర్థ్యాన్ని కోల్పోయింది.

ఇప్పుడు కోస్తా ఆంధ్రాను చూడండి 

1990ల నుండి 2020 వరకు, సాఫ్ట్‌వేర్ రంగం మనకు ‘సహజ వాయువు’లాగా మారింది. అమెరికా నుండి వచ్చే డాలర్లు మన ప్రాంతాన్ని ముంచెత్తాయి. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి,  విశాఖపట్నంలలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పెరిగింది. దీనితో పాటు ఒకే ఒక సాంస్కృతిక సూత్రం స్థిరపడిపోయింది:
 
ఇంజనీరింగ్  డిగ్రీ -> సాఫ్ట్‌వేర్ ఉద్యోగం -> హెచ్1-బిB వీసా -> అమెరికాలో స్థిరపడటం. ఇది లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడింది. కానీ మన మేధోపరమైన వైవిధ్యాన్ని ఇది దెబ్బతీసింది. వ్యవసాయం నిర్లక్ష్యంకు గురైంది.  ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన కృష్ణా- గోదావరి డెల్టా ప్రాంతం కేవలం ‘వదిలి వెళ్లాల్సిన చోటు’గా మారిపోయింది.
నైపుణ్యం కలిగిన వృత్తులు చిన్నచూపుకు గురయ్యాయి. పరిశోధనలు తగ్గాయి.

సాఫ్ట్‌వేర్ జీతం సులభంగా వస్తున్నప్పుడు, పదేళ్లు కష్టపడి పిహెచ్ డి చేయడం ఎందుకనే ధోరణి పెరిగింది. జీవితానికి అర్థం ఉందా? లేదా? అని కాకుండా, కేవలం ‘జీతం, వీసా’ ఉన్నాయా? లేదా? అన్నదే ప్రామాణికంగా మారింది. డొల్ల పునాదులపై దూసుకొస్తున్న ఏఐ తుఫాను సాఫ్ట్‌వేర్ రంగం మిగిలిన వృత్తులకు ఏం చేసిందో, ఇప్పుడు ఏఐ అదే పనిని సాఫ్ట్‌వేర్ రంగానికి చేస్తోంది. ప్రస్తుతం ఏఐ గురించి ఉన్న అవగాహన, 1990ల నాటి హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ బుడగలా ఉంది. అందరూ మాట్లాడుతున్నారు, కానీ లోతైన అవగాహన ఉన్నవారు తక్కువ.

రాబోయే ఏఐ ఆర్థిక వ్యవస్థ పనిని మూడు స్థాయిలుగా విభజిస్తుంది.  

మొదటి స్థాయి (భౌతిక నైపుణ్యం):ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, సర్జన్లు, వ్యవసాయ సాంకేతిక నిపుణులు. ఏఐ ఒక ఇంటికి వైరింగ్ చేయలేదు లేదా పొలంలోని సాగునీటి వ్యవస్థను రిపేర్ చేయలేదు. ఇది భవిష్యత్తులో అత్యంత స్థిరమైన రంగం కావచ్చు.

రెండవ స్థాయి (నిజమైన వ్యాపారవేత్తలు): కేవలం మధ్యవర్తిత్వం చేసే వ్యాపారాలు (ట్రావెల్ ఏజెంట్లు, రిక్రూట్‌మెంట్ కన్సల్టెంట్లు) ఏఐ వల్ల దెబ్బతింటాయి. కానీ మానవ సంబంధాలు, నమ్మకం, క్లిష్టమైన నిర్ణయాలపై ఆధారపడే వ్యాపారాలకు ఏఐ ఒక సాధనంగా మారుతుందే తప్ప, వాటిని భర్తీ చేయలేదు.

మూడవ స్థాయి (లోతైన మేధస్సు): శాస్త్రవేత్తలు, పరిశోధకులు, గణిత శాస్త్రజ్ఞులు. ఏఐ అందించే సమాచారాన్ని కేవలం వాడుకునే వారు కాదు, కొత్త విషయాలను కనుగొనే వారు.

ప్రమాదం ఎక్కడ ఉందంటే కోస్తా ఆంధ్రలోని మెజారిటీ సాఫ్ట్‌వేర్ తరం ఈ రెండవ, మూడవ స్థాయిల మధ్య ఉండే ‘మిడిల్ లేయర్’ (కోఆర్డినేటర్లు, జూనియర్ కన్సల్టెంట్లు)లో ఉన్నారు. ఏఐ ప్రధానంగా దెబ్బకొట్టేది ఈ మధ్య స్థాయి ఉద్యోగాలనే.

తల్లిదండ్రులకు ఒక సూచన

మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోండి:
 
* నేను నా బిడ్డకు కేవలం వేగాన్ని నేర్పిస్తున్నానా? లేక లోతైన అవగణనను నేర్పిస్తున్నానా?
* రాబోయే ఐదేళ్ల కోసమే సిద్ధం చేస్తున్నానా, లేక యాభై ఏళ్ల కోసమా?
* ఒక వస్తువును ఎలా వాడాలో మాత్రమే కాకుండా, అది ఎందుకు అలా పనిచేస్తుందో వివరించగలిగే ‘లోతైన అవగాహన’ ఉన్న విద్యార్థి ఈ ఏఐ యుగంలో నెట్టుకురాగలడు.
 
సాఫ్ట్‌వేర్ యుగం మనకు ఆర్థిక స్థిరత్వాన్ని, గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఇచ్చింది. ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని సరైన దిశలో మళ్లించాల్సిన సమయం వచ్చింది. పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లాల్సిన పనిలేదు. భారతదేశంలోనే ఐఐఎస్సీ, ఐఐటీ వంటి గొప్ప సంస్థలు ఉన్నాయి. లోతైన అవగాహన ఉన్నవారిని ఏ విప్లవమూ ఏమీ చేయలేదు. కేవలం పైపైన నేర్చుకునే వేగం మాత్రమే ఉన్నవారికి దారి కష్టమవుతుంది. డాక్టర్ యలమంచిలి శివాజీ ప్రారంభించిన ఈ చర్చ మన సమాజంలో నిజాయితీగా జరగాల్సిన అవసరం ఉంది.