తప్పుడు ఫిర్యాదులు, నకిలీ సాక్ష్యాలపై సుప్రీం నోటీసులు 

తప్పుడు ఫిర్యాదులు, నకిలీ సాక్ష్యాలపై సుప్రీం నోటీసులు 
 
దేశవ్యాప్తంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న తప్పుడు ఫిర్యాదులు, నకిలీ సాక్ష్యాల సమస్యపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక విచారణ చేపట్టింది. ఈ తీవ్రమైన అంశంపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 
 
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై స్పందిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 11న జరిగే అవకాశం ఉంది.  భారతీయ నాగరిక సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్), 2023లోని సెక్షన్లు 215, 379లను ఉన్నది ఉన్నట్లుగా అన్వయించడం వల్ల పలు శిక్షాస్మృతి నిబంధనలు నీరుగారిపోతున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 
 
దీనివల్ల కొందరు వ్యక్తులు వ్యక్తిగత కక్షలతో పోలీస్ స్టేషన్లను తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లతో, కోర్టులను తప్పుడు కేసులతో ముంచెత్తుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం తప్పుడు కేసుల బాధితులు నేరుగా న్యాయపోరాటం చేసేందుకు కోర్టు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి కావడం, జవాబుదారీతనానికి అడ్డుకట్టగా మారిందని ఆయన వాదించారు. చట్టంలోని లొసుగులను వాడుకుని అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

తప్పుడు కేసుల వల్ల అమాయక పౌరులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొందరు అవమానం భరించలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో ఒక కుటుంబం తప్పుడు కేసుల భయంతో సామూహిక ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ధర్మాసనానికి వివరించారు. 

ఈ నేపథ్యంలో, తప్పుడు కేసుల బాధితులు నేరుగా కోర్టు అనుమతితో ఫిర్యాదు చేసేలా చట్టంలోని నిబంధనలకు సరైన వివరణ ఇవ్వాలని కోరారు. చట్టం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలని, అమాయకులను కాపాడేందుకు సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.