పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించిన మోదీ, ట్రంప్‌

పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించిన మోదీ, ట్రంప్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇరు దేశాధినేతలు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం గురించి చర్చించారు.  ఈ విషయాన్ని మంగళవారం ఇటు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొనగా, అటు అమెరికా తరఫున భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.

“అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే ప్రధానమంత్రి మోదీతో మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచే ప్రాముఖ్యతతో సహా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితిపై వారు చర్చించారు,” అని గోర్ పేర్కొన్నారు. ఇరాన్‌తో ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం మొదలైన తర్వాత మోదీ, ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి.  పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌తో చర్చలు జరిపినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన మర్నాడే ట్రంప్-మోదీల మధ్య ఈ సంభాషణ జరిగింది.

పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతి స్థాపనకు ఇండియా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు.  అలాగే, హార్ముజ్ జలసంధిని తెరిచి, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచడం అవసరమని పేర్కొన్నారు. ఈ అంశంలో స్థిరత్వం, శాంతికి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ట్రంప్‌నకు మోదీ తెలిపారు.   

“అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థితిపై ఉపయోగకరమైన అభిప్రాయాలను పంచుకున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి, వీలైనంత త్వరగా అక్కడ శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుంది. హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరం. శాంతి, సుస్థిరత కోసం చేసే ప్రయత్నాలకు భారత్‌ సహకారం ఉంటుంది.” అని మోదీ పేర్కొన్నారు.