కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీకి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ మంగళవారంనాడు తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులు సోఫీ ఫమీదా, నహిదా నస్రీన్‌లకు కోర్టు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

దేశానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతున్నారని, యుద్ధానికి ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ ఆదేశాలతో 2018 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో అసియా అంద్రాబీని ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేశారు. ఆమెతో కలిసి పనిచేస్తున్న అనుచరులు సోఫీ ఫమీదా, నహిదా నస్రీన్‌పై 2021లో కేసు నమోదైంది.  ఈ ముగ్గురుని జనవరి 14న కోర్టు ముందు హాజరుపరచగా, ఉపా చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వీరిని దోషులుగా కోర్టు గుర్తించింది. 

ఈ సందర్భంగా నిందితులు ముగ్గురికి కఠిన శిక్ష విధించాలని కోర్టును ఎన్‌ఐఏ కోరింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడాలనుకునే మిగతావారికి ఈ శిక్ష ఒక సందేశం కావాలని ఎన్‌ఐఏ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.  విచారణ సందర్భంగా  దేశం నుంచి జమ్మూ కాశ్మీర్‌ను విడగొట్టేందుకు కుట్రలు పన్నడం, దేశానికి వ్యతిరేకంగా పోరాడటం వంటి నేరాల కింద వీరికి కోర్టు ఈ శిక్ష విధించింది. ఉగ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలున్నట్లు తేలింది. నిందితులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్లు ఆరోపించింది. 

ఆసియా కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయడానికి వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపించింది. ఒక మహిళా సంస్థ ద్వారా కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలపాలనే లక్ష్యంతో కుట్రలు చేసింది. అలాగే షరియా చట్టాన్ని సమర్ధించింది. గతంలో అనేక ఆరోపణలపై ఆసియాను చాలాసార్లు అరెస్టు చేశారు.  ఆండ్రాబీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన అనంతరం, జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ మాట్లాడుతూ, “ఆసియా ఆండ్రాబీ ఒక ఉగ్రవాది… ఆమె దాడులు, రాళ్ల దాడి, వేధింపులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులను రాడికలైజ్ చేయడంలో పాలుపంచుకుంది” అని తెలిపారు.
 
 “ఆమె జమ్మూ కాశ్మీర్, యావత్ దేశ భద్రతకు ప్రమాదకారి. ఆమె జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశం నుండి వేరు చేయాలని కోరుకుంది… ఆమె 90వ దశకంలో ఒక ఉగ్రవాద నాయకురాలిగా వ్యవహరించింది. యావజ్జీవ కారాగార శిక్షను బీజేపీ స్వాగతిస్తుంది. ఆమె సహచరులలో ఇద్దరు జమ్మూ కాశ్మీర్‌లోని మహిళలు, బాలికల జీవితాలను నరకం చేశారు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం, ఇక్కడ ఒకరి దుస్తులు, జీవనశైలిని మీరు నిర్దేశించలేరు… వారిని ఉరితీయాలి,” అని స్పష్టం చేశారు.