మిలిట‌రీలో ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌కు మ‌హిళా ఆఫీస‌ర్లూ అర్హులే

మిలిట‌రీలో ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌కు మ‌హిళా ఆఫీస‌ర్లూ అర్హులే
సైనిక ద‌ళాల్లోని ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు కీల‌క తీర్పును వెలువ‌రించింది. మ‌హిళా మిలిట‌రీ ఆఫీస‌ర్లు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌కు అర్హులు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసు విష‌యంలో సుప్రీం కోర్టు అసాధార‌ణ అధికారుల‌ను వినియోగించుకున్న‌ది. షార్ట్ స‌ర్వీస్ క‌మీష‌న్‌(ఎస్ఎస్సీ) కింద రిక్రూట్ అయిన మ‌హిళా ఆఫీస‌ర్లు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ పొందేందుకు అర్హుల‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. 

మిలిట‌రీ ప్ర‌మోష‌న్ల విధానంలో ఉన్న వ్య‌వ‌స్థీకృత లోపాల‌ను కోర్టు ఎత్తి చూపింది. మ‌హిళా ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌ను ఇవ్వ‌క‌పోవ‌డం విధాన నిర్ణ‌యం లోప‌మ‌ని కోర్టు చెప్పింది. ప్ర‌తి ఏడాదికి కేవ‌లం 250 మంది మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వాల‌న్న నిబంధ‌న‌ను కూడా కోర్టు కొట్టిపారేసింది. ఆ నిర్ణ‌యం ఏక‌ప‌క్షంగా ఉంద‌ని, దాంట్లో ప‌విత్ర‌త లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. 

సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మిలిట‌రీలో లింగ స‌మాన‌త్వాన్ని సూచిస్తున్న‌ది. ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ పొందిన‌వారు రిటైర్మెంట్ వ‌య‌సు వ‌ర‌కు విధులు నిర్వ‌ర్తించ‌వ‌చ్చు. సైన్యంలో ఉన్న‌త ప‌దువుల‌ను గ‌తంలో కేవ‌లం పురుషుల‌కు మాత్ర‌మే ఇచ్చేవారు. అయితే తాజా తీర్పుతో మ‌హిళ‌ల‌కు కూడా అత్యున్న‌త హోదా ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. 

ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ అనేది త‌మ‌కే ఉంటుంద‌న్న భావ‌న‌లో మేల్ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆఫీస‌ర్లు ఉండ‌రాదు అని కోర్టు చెప్పింది. మ‌హిళా ఆఫీస‌ర్ల ప‌ట్ల ఉన్న వివ‌క్ష‌ అది విధాన రూప‌క‌ల్ప‌న లోప‌మ‌ని చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ పేర్కొన్నారు. మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు చెందిన వార్షిక విశ్వ‌స‌నీయ నివేదిక‌(ఏసీఆర్‌)ల‌ను మిలిట‌రీ ఆఫీస‌ర్లు చాలా తేలిక‌గా తీసుకుంటున్న‌ట్లు కోర్టు చెప్పింది.

అలాగే, త్రివిధ దళాల్లోని మహిళా అధికారులకు పూర్తి పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సైన్యం, నౌకాదళం, వాయుసేనలోని మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులకు పూర్తి పింఛన్‌ ప్రయోజనాలు పొందటానికి హక్కు ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

 
ఈ క్రమంలోనే మహిళలపై ఉన్న వ్యవస్థాగత పక్షపాతాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. మహిళా అధికారులు ముందే పదవీ విరమణ చేస్తే పెన్షన్‌కు అవసరమైన 20ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసినట్లుగా పరిగణిస్తారని ధర్మాసనం పేర్కొంది. 2019నాటి విధానపరమైన మార్పులు, సాయుధ దళాల ట్రిబ్యునల్ తీర్పుల ఆధారంగా ‘శాశ్వత కమిషన్’ నిరాకరించడాన్ని సవాల‌్ చేస్తూ వింగ్ కమాండర్ సుచేత ఎడన్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.