రైతులకు పూర్తి రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. అయితే, రైతుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) ద్వారా సకాలంలో తగినంత రుణం అందించడం కూడా ఉందని తెలిపారు. ఈ కేసీసీ కింద రూ. 3 లక్షల వరకు పంట రుణాన్ని రాయితీ వడ్డీ రేట్లకు అందిస్తున్నామని తెలిపారు.
సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కింద సకాలంలో తిరిగి చెల్లిస్తే అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామని గుర్తు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన ప్రాధాన్య రంగ రుణాల మార్గదర్శకాల ప్రకారం అనుబంధ కార్యకలాపాల రుణాలతో సహా, పూచీకత్తు లేని స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షలకు ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు.
అలాగే వ్యవసాయంతో సహా ఆర్థిక వ్యవస్థలోని ప్రాధాన్య రంగాలకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తగినంత రుణ ప్రవాహం ఉండేలా చూస్తున్నామని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. వీటితోపాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద రైతులకు నేరుగా నగదు బదిలీతో పాటు పంటల బీమా అందిస్తున్నామని పేర్కొన్నారు.
మరోవైపు సాయుధ దళాల్లో పని చేస్తూ తీవ్రమైన వైకల్యం సంభవించి సర్వీస్ నుంచి వైదొలగిన సైనికులు పొందే వైకల్య పింఛనుకు ఆదాయపు పన్ను మినహాయింపుపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆ పన్ను మినహాయింపును నిలిపివేయడం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇంతకుముందు ఉన్న మినహాయింపు, దాని పరిధిని షరతులతో సహా కొనసాగేలా చూసేందుకే ప్రస్తుత నిబంధనను చేర్చినట్లు ఆమె వివరించారు.
“2025 ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రావడంతో 1922 ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన మినహాయింపు నిబంధనలు అమలులో లేకుండా పోయాయి. అందువల్ల, కొత్త చట్టంలో స్పష్టమైన నిబంధన లేనందున మినహాయింపు రద్దయి ఉండేది. అందుకే దానిని కొనసాగించేలా కొత్త నిబంధనను ఇందులో చేర్చాం.” అని ఆర్థిక మంత్రి చెప్పారు.
2026 జనవరి 31 నాటికి వైకల్యంతో సాయుధ దళాల సర్వీస్ నుంచి పదవీ విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బంది సంఖ్య 1,47,263గా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వైకల్యం కారణంగా సర్వీస్ తొలగించి పింఛను పొందుతున్న సాయుధ దళాల సిబ్బంది 89,598 మంది అని ఆమె వివరించారు.
కాగా, లోక్‌సభలో కార్పొరేట్ చట్టాల (సవరణ) 2026 బిల్లును కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సమగ్ర పరిశీలన కోసం ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపాలన్న తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు పరిమిత బాధ్యత భాగస్వామ్య చట్టం 2008, కంపెనీల చట్టం 2013లకు మరిన్ని సవరణలను కోరుతోంది.

More Stories
లోక్‌సభలో 816 సీట్లకు పెంపు, మహిళలకు 273
మూడు ప్రత్యేక జోన్లుగా హైదరాబాద్ నగరం విభజన
హైదరాబాద్ మెట్రో ఛార్జీలు ఢిల్లీ కంటే ఎక్కువ