లోక్‌సభలో 816 సీట్లకు పెంపు, మహిళలకు 273

లోక్‌సభలో 816 సీట్లకు పెంపు, మహిళలకు 273
లిజ్ మాథ్యూ

* 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు

‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ల చట్టం) సవరణపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను సంప్రదిస్తుంది. ఈ చట్టాన్ని రాబోయే జనాభా లెక్కలు, ఆ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టకుండా విడదీయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా, మొదటి అడుగుగా 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ, శాసనసభల సభ్యుల సంఖ్యను పెంచవచ్చని ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. 
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన ఒక ప్రతిపక్ష పార్టీ పార్లమెంటు సభ్యుడు సోమవారం ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‘తో మాట్లాడుతూ, ఒక ప్రతిపాదన గురించి వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 816కు పెంచవచ్చని ఆ ప్రతిపాదన పేర్కొంటోందని ఆయన తెలిపారు. 
 
పెరిగిన లోక్‌సభ సభ్యుల సంఖ్య ఆధారంగా, ఈ సీట్లలో 273 స్థానాలను మహిళలకు రిజర్వు చేయవచ్చని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ ఎంపీ పేర్కొన్నారు. సోమవారం పార్లమెంటు భవనంలో బిజెడి, వైఎస్సార్సీపీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యుబిటి), ఎఐఎంఐఎం పార్టీల నాయకులతో షా సమావేశమయ్యారు. తదనంతరం కాంగ్రెస్, టిఎంసి, డీఎంకే, ఎస్పీ పార్టీల నాయకులతో కూడా ఆయన సమావేశమవుతారని భావిస్తున్నారు.
 
ఈ సమావేశానికి తమ ప్రతినిధులను పంపిన మరో రెండు పార్టీల వర్గాలు కూడా షా చేసిన సూచనలను ధృవీకరించాయి. జనాభా లెక్కల ప్రక్రియ 2029 తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉన్నందున, ‘నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చట్టం’, ‘మహిళా రిజర్వేషన్ల చట్టం’లలో రాజ్యాంగ సవరణల ద్వారా లోక్‌సభ, శాసనసభ సీట్ల పెంపును సాధించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. 
 
ప్రభుత్వంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న మరో పార్టీకి చెందిన ఎంపీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, తద్వారా అన్ని రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల నిష్పత్తి ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగుతుందని ఆయన తెలిపారు.  తమ జనాభాకు అనుగుణంగా సీట్ల సంఖ్యను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన దక్షిణాది రాష్ట్రాల భయాలను ఇది తొలగిస్తుంది. సమావేశంలో షా చేసిన సూచనల ఆధారంగా, లోక్‌సభ, శాసనసభ సీట్ల సంఖ్యను 50 శాతం వరకు పెంచే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
 
మహిళా రిజర్వేషన్ల చట్టం (దీనిని రాజ్యాంగం 106వ సవరణ చట్టం అని కూడా పిలుస్తారు) అమలును నియోజకవర్గాల పునర్విభజన, జనాభా గణన ప్రక్రియల నుండి వేరు చేసి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే దీనిని అమలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‘ ఈ ఏడాది మార్చి 10న ఒక కథనంలో పేర్కొంది. 
 
ప్రతి రాష్ట్రంలో మహిళలకు కేటాయించే స్థానాలను నిర్ణయించడానికి లాటరీ పద్ధతిని అనుసరించే అవకాశాన్ని కూడా ప్రతిపాదించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న ఒక ఎంపీ తెలిపారు. “మహిళల కోసం రిజర్వు చేసే మొత్తం స్థానాల సంఖ్యను లాటరీ పద్ధతి ద్వారా నిర్ణయిస్తారని మాకు అర్థమైంది. ప్రతి మూడవ స్థానం మహిళలకే కేటాయించే అవకాశం ఉంది. అయితే, ఈ స్థానాలు శాశ్వతంగా మహిళలకే కేటాయించబడతాయా? లేక రొటేషన్ పద్ధతిలో (మార్పిడి పద్ధతిలో) కేటాయిస్తారా? అనే విషయంపై ఎటువంటి చర్చ జరగలేదు,” అని ఆ ఎంపీ పేర్కొన్నారు. 
 
లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం మేర పెంచుతారని, అయితే లోక్‌సభలో ప్రతి రాష్ట్రానికి ఉండే ప్రాతినిధ్య వాటా శాతంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని ఆ ఎంపీ తెలిపారు. “హిందీ మాట్లాడే ఉత్తర భారత ప్రాంతంలోని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది,” అని ఆ ఎంపీ తెలిపారు. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 80 స్థానాల సంఖ్య 120కి పెరిగే అవకాశం ఉంది. 
 
అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైన తర్వాతే ఈ మార్పులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ సవరణను తీసుకువచ్చే అవకాశం ఉందని ఈ చర్చల గురించి అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి.  ఇందుకోసం ప్రస్తుత సమావేశాలనే పొడిగించే అవకాశం ఉందని లేదా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా,  ‘ఇండియా’ కూటమికి చెందిన వివిధ పార్టీల సభా నాయకులతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం సాయంత్రం ఈ విషయమై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 
 
(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుండి)