ఇరాన్‌కు కశ్మీరీలు నగదు, బంగారం, నిత్యావసరాలు విరాళం

ఇరాన్‌కు  కశ్మీరీలు నగదు, బంగారం, నిత్యావసరాలు విరాళం

యుద్ధ పీడిత ఇరాన్‌కు విరాళాలు అందజేసేందుకు కశ్మీర్‌ ప్రజలు ముందుకు వచ్చారు. పశ్చిమ ఆసియాలో సంఘర్షణ కారణంగా ఇరాన్‌లో ప్రభావితమైన ప్రజలకు మద్దతుగా బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో మానవతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈద్ వేడుకల తర్వాత షియా ప్రాబల్య ప్రాంతాల వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించారు.  కశ్మీర్‌ ప్రజలు కేవలం డబ్బు మాత్రమే కాకుండా, బంగారం, వెండి ఆభరణాలతో పాటు సాంప్రదాయ రాగి వస్తువులు, పశువులను కూడా విరాళంగా అందించారు. 

చాలా మంది మహిళలు తమ వ్యక్తిగత బంగారు ఆభరణాలు, విలువైన గృహోపకరణాలను విరాళంగా అందజేశారు. ఒక కశ్మీరీ వితంతువు తన భర్త జ్ఞాపకార్థం 28 ఏళ్లుగా దాచుకున్న బంగారు జ్ఞాపికను విరాళంగా ఇచ్చింది. పిల్లలు కూడా తమ పొదుపు, ఈద్ డబ్బును విరాళంగా ఇచ్చారు.  ఇరాన్‌లో సహాయక చర్యల కోసం తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తానని బుద్గాం ఎమ్మెల్యే ముంతాజిర్ మెహదీ ప్రకటించారు.

మరోవైపు కశ్మీర్‌ ప్రజలు అందజేసిన విరాళాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం డబ్బు, ఆభరణాలను విరాళంగా ఇచ్చిన భారతీయుల ’దయ’, ‘మానవత్వానికి’ కృతజ్ఞతలు తెలిపింది.

‘మానవతా మద్దతు, హృదయపూర్వక సంఘీభావంతో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచిన కశ్మీర్ ప్రజలకు మేం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ దయ ఎప్పటికీ మరిచిపోలేం. భారత దేశానికి ధన్యవాదాలు’ అని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఎక్స్‌లో పేర్కొంది.  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ప్రభావిత ప్రజలకు సహాయం కోసం భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం వారం కిందటే సోషల్ మీడియాలో బ్యాంకు ఖాతా వివరాలను షేర్‌ చేసింది. 

ఇది కేవలం సాయం మాత్రమే కాదని భావోద్వేగ అనుబంధాన్ని కూడా చూపించిందని  పేర్కొంది. ముఖ్యంగా షియాలు అధికంగా ఉన్న బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.  ఇరాన్ రాయబార కార్యాలయంతో పాటు అధికారిక సహాయక సంస్థల ద్వారా సేకరించిన విరాళాలు అవసరమైన వారికి పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావిత ఇరాన్‌ ప్రజలకు మద్దతుగా భారత్‌ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.