హైదరాబాద్ మెట్రో ఛార్జీలు ఢిల్లీ కంటే ఎక్కువ

హైదరాబాద్ మెట్రో ఛార్జీలు ఢిల్లీ కంటే ఎక్కువ

ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే అత్యంత చౌకైన రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో విస్తృతమైన మెట్రో నెట్‌వర్క్‌ ఉంది. విస్తరణపరంగా వెనకబడిన హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణ ఛార్జీలు ఏమో డిల్లీ మెట్రో కన్నా ఎక్కువగా ఉన్నాయి. మెట్రో విస్తరణ ఎంత ప్రధానమో, ప్రయాణ ఛార్జీలు అందుబాటులో ఉండటం అంతే ముఖ్యం కాగలదు. 

ఛార్జీలు పెంచడంతో హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణికులు తగ్గారని అధికారుల కమిటీ ఇటీవలే ప్రకటించింది. గత సంవత్సరం ఛార్జీలను 20 నుంచి 30 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. క్రితం ఆర్థిక సంవత్సరంలో రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య 4.44 లక్షలు ఉన్నారు. హైదరాబాద్‌ మెట్రో ఛార్జీలు పెంచిన అనంతరం 4.28 లక్షలకు తగ్గినట్లు నివేదికలో వెల్లడించారు.

హైదరాబాద్‌ నగరంలో ఆర్డినరీ బస్సులు, ఆటో కనిష్ఠ ఛార్జీ రూ.15తో పోలిస్తే మెట్రోనే చౌక అని అధికారులు అంటున్నారు. కనీస ఛార్జీ తక్కువే ఉన్నా కూడా 9 కి.మీ. దాటితే రూ.47 అవుతోందని, ఇది ఒకింత ప్రయాణికులకు భారమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పుడు ప్రైవేట్ నిర్వహణలో ఉన్న హైదరాబాద్‌ మెట్రో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక ఛార్జీల పరంగా ఊరట కల్పించేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.   ఢిల్లీ మెట్రో గత సంవత్సరం కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.11కి, గరిష్ఠ ఛార్జీని రూ.60 నుంచి రూ.64కి పెంచారు. చాలా మెట్రోలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. 

ఛార్జీలు అందుబాటులో ఉండటంతో ప్రయాణికుల ఆదరణ పొందింది ఢిల్లీ మెట్రో. హైదరాబాద్‌ మెట్రోలో గత సంవత్సరం కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠంగా రూ.60 నుంచి రూ.75కు పెంచింది. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది.  దీంతో హైదరాబాద్‌ మెట్రో 10 శాతం రాయితీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు కనిష్ఠ ఛార్జీ రూ.11 ఉండగా గరిష్ఠంగా రూ.69 వసూలు చేస్తున్నారు. 

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మెట్రో ఈ సంవత్సరం గత నెలలో కనిష్ఠ ఛార్జీలు రూ.10 నుంచి రూ.11కు, గరిష్ఠంగా రూ.90 నుంచి రూ.95కి పెంచారు. పలు రాజకీయ కారణాలతో అమలు నిలిపివేసింది. ఇప్పుడు బెంగళూరు మెట్రో రూ.10 నుంచి రూ.90 మధ్య ఛార్జీలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో రూ.10 నుంచి రూ.50 మధ్యలో ఉన్నాయి. అత్యంత చౌకగా కోల్‌కతాలో రూ.5 నుంచి రూ.30 ఛార్జ్‌ చేస్తున్నారు.