ఉచిత ప్రసారాల కోసం పార్టీలకు డిజిటల్ వోచర్లు

ఉచిత ప్రసారాల కోసం పార్టీలకు డిజిటల్ వోచర్లు

దేశంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జాతీయ, రాష్ట్ర స్తాయి రాజకీయ పార్టీలకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఉచితంగా ప్రసారం, టెలికాస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అందుకోసం డిజిటల్ వోచర్లను కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.  ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 39ఎ  ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. 

అసెంబ్లీ ఎన్నిక కోసం పుదుచ్చేరి, కేరళ, అసోం, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఐటీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ డిజిటల్ టైం వోచర్ల జారీ చేసినట్లు పేర్కొంది. పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలై తేదీ నుంచి పోలింగ్కు రెండు రోజుల ముందు వరకు ఈ ఉచిత ప్రసార సమయం అందుబాటులో ఉంటుందని చెప్పింది. ప్రసార సమయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో లాటరీ ద్వారా పారదర్శకంగా నిర్ణయిస్తారని వెల్లడించింది.

ప్రతి గుర్తింపు పొందిన పార్టీకి దూర్శదన్, ఆల్ ఇండియా రేడియోలో 45 నిమిషాల ఉచిత ప్రసార సమయం ఇస్తారు. ఈ సమయాన్ని సంబంధిత రాష్ట్రాల్లోని ప్రాంతీయ ఛానెళ్లలో సమానంగా విభజిస్తారు. అదనపు ప్రసార సమయం గత ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన ఆధారంగా కేటాయిస్తారు. తద్వారా ఎన్నికల్లో మంచి ప్రాబల్యం ఉన్న పార్టీలకు ప్రయోజనం చేకూరుతుందని ఈసీ స్పష్టం చేసింది.

అయితే రాజకీయ పార్టీలు సాంకేతిక, నియంత్రణా ప్రమాణాలకు అనుగుణంగా ట్రాన్స్కిప్ట్‌లు, రికార్డింగ్‌లను ముందుగానే సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ప్రసార భారతి నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న స్టూడియోలలో లేదా దూరదర్శన్‌/ఆల్‌ ఇండియా రేడియో కేంద్రాలలో రికార్డింగ్‌లు చేయవచ్చు.  అలాగే వ్యక్తిగత పార్టీ ప్రసారాలకు అతీతంగా, ప్రసార భారతి ప్యానెల్‌ చర్చలు వాదోపవాదాలను కూడా నిర్వహిస్తుంది.

 
తద్వారా పార్టీలు తమ అభిప్రాయాలను సమిష్టిగా వెలిబుచ్చడానికి వీలు కలుగుతుంది. పార్టీ ప్రసారాలతోపాటు, ప్రసార భారతి కార్పొరేషన్‌.. దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియోలో రెండింటిలోనూ చర్చలు, వాదోపవాదలను నిర్వహిస్తంది. అనుమతి పొందిన సమన్వయకర్త పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమానికి అర్హత గల ప్రతి రాజకీయ పార్టీ ఒక ప్రతినిధిని నామినేట్‌ చేయవచ్చు అని ఇసిఐ తన ప్రకటనలో పేర్కొంది.