అస్సాంలో హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ!

అస్సాంలో  హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ!

* పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ తాజాగా రెండో ట్రాకర్ పోల్ సర్వే
ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా అధికారపక్షం కొనసాగింపు కోసం జరగనున్నాయని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.  పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అస్సాంలో తాజాగా నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని  ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు వెల్లడయింది. 

2026 మార్చి 9 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి రెండో ట్రాకర్ పోల్ సర్వే అస్సాం ఓటర్ల మూడ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఎన్నికలు అధికార మార్పు కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు. ఇది అస్సాంలో గత ఐదేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు. 
ఈ నేపథ్యంలో చూసినప్పుడు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతగా కనిపించడం లేదు. స్థిరత్వం, నాయకత్వం, అభివృద్ధి అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో తేలిందని  పీపుల్స్ ప‌ల్స్ డైరెక్టర్  ఆర్‌. దిలీప్ రెడ్డి తెలిపారు. 

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే 69 నుంచి 73 సీట్లు గెలుచుకునే అవకాశముందని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అంటే, బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటే స్థాయిలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 26 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఈ తేడా  కేవలం సీట్ల సంఖ్యలోనే కాకుండా రాజకీయంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపుతోంది.

ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరింత బలపడే అవకాశం ఉంది. అస్సాంలో బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ 8 నుంచి 11 సీట్లు, బీపీఎఫ్ 8 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఎన్డీయే కూటమి 90 సీట్లు కైవసం చేసుకునే అవకాశముంది. ఇది సాధారణ విజయం కాదు. ఇది స్పష్టమైన ప్రజా తీర్పు, స్థిరమైన ప్రభుత్వానికి సంకేతంగా చూడాలి. మరోవైపు ఏఐయూడీఎఫ్, రైజోర్ దల్,యూపీపీఎల్, ఏజీపీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో పరిమిత స్థాయిలోనే ప్రభావం చూపే పరిస్థితి ఉంది.


అయితే ఈ ఎన్నికల్లో  ఓటు షేర్ ఫలితాలను విశ్లేషిస్తే పరిస్థితి కాస్త వేరేలా కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో  బీజేపీకి 39% ఓటు షేర్, కాంగ్రెస్‌కు 36.5% ఓటు షేర్ వస్తుందని అంచనా వేసింది. ఈ తేడా పెద్దది కాకపోయినా, అస్సాం రాజకీయాల్లో ఇది భారీ మెజారిటీకి దారి తీస్తుంది. ఎందుకంటే, ఇక్కడ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కట్టుగా ఓట్లను సీట్లుగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండగా,  ప్రతిపక్షం ఇప్పటికీ అంతర్గత కలహాలతో కాలం గడుపుతోంది.
 
హిమంత బిస్వ శర్మ ప్రజాదరణ బీజేపీకి ప్రధాన బలం
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం కూడా కీలక అంశంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు ఉన్న ప్రజాదరణ బీజేపీకి ప్రధాన బలంగా మారింది. పీపుల్స్ పల్స్  సర్వే ప్రకారం 40% మంది అస్సాం ప్రజలు మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా, కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగోయ్‌ 33% మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు.  ముఖ్యంగా మహిళలు, గిరిజన వర్గాల్లో ముఖ్యమంత్రి హిమంతకు ఉన్న మద్దతు బీజేపీకి, ఎన్డీయే కూటమి పక్షాలకు అదనపు బలాన్ని  ఇస్తోంది.

అస్సాం రాష్ట్రాన్ని ప్రధానంగా 5 పరిపాలనా విభాగాలుగా విభజించారు. ఈ ఐదింటిని  ప్రాంతాల వారీగా చూసినప్పుడు, అస్సాం రాజకీయాలు ఏకరీతిగా కనిపించడం లేదు. ఎగువ అస్సాంలో ఎన్డీయే బలంగా ఉండి, అధికశాతం నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్, రైజోర్ దల్ కాస్త పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయి.  సిబ్సాగర్‌లో రైజోర్ దల్ పోటీగా ఉండగా, నజీరా, టియోక్, టిటాబర్, జోర్హాట్ లాంటి చోట్ల కాంగ్రెస్ బలపడింది. డూమ్ డూమా, డెర్గావ్, సోనారి లాంటి చోట్ల క్లోజ్ ఫైట్ కనిపిస్తోంది.

మధ్య అస్సాంలో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. నాగావ్, హోజై, కార్బి ఆంగ్లాంగ్ వంటి జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. ధింగ్, దల్‌గావ్ వంటి బలమైన సీట్లు రైజోర్ దల్‌కు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఈ ప్రాంతంలో బలహీనపడింది. ఇదే సమయంలో  కొన్ని చోట్ల ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏఐయూడీఎఫ్ కి అవకాశాలు కల్పిస్తోంది.

దిగువ అస్సాంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏఐయూడీఎఫ్ మెరుగైన స్థానంలో ఉంది. గౌరిపూర్, శ్రీజంగ్రామ్ లాంటి చోట్ల పార్టీ ముందంజలో ఉండగా, చెంగా, ధుబ్రి లాంటి చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. అయినప్పటికీ మొత్తం ప్రాంతంగా అంచనాలను విశ్లేషిస్తే ఎన్డీయే ఆధిపత్యమే కొనసాగుతోంది. బరాక్ వ్యాలీలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కొన్ని చోట్ల బలంగా ఉంది. సోనై, బార్కోలా, అల్గాపూర్, కరీంఘంజ్ సౌత్ వంటి చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశముంది. కరీంఘంజ్ నార్త్‌లో మాత్రం హోరాహోరి పోటీ నెలకొంది.

 
గతంతో పోలిస్తే మెరుగైన ఏఐయూడీఎఫ్
ఈ ఎన్నికల్లో కొన్ని కీలక ట్రెండ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐయూడీఎఫ్ గతంతో పోలిస్తే కొంత మెరుగైంది. కానీ ఇది ఆ పార్టీవైపు వీస్తున్న గాలివల్ల కాకుండా,  ఆ పార్టీ నిలబెడుతున్న అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం వల్లే అని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో వెల్లడయింది. గెలిచే అవకాశమున్న సీట్లు వదిలేయడం వల్ల  కాంగ్రెస్ – రైజోర్ దల్ కూటమిలో కాంగ్రెస్‌కే నష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

బీజేపీలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపుల్లో చేసిన కొన్ని తప్పులు, పాత నాయకులను పక్కన పెట్టడం వల్ల కొంత అసంతృప్తి ఉంది. అయితే ఇవి పెద్ద స్థాయిలో ప్రభావం చూపేలా కనిపించడం లేదు. అస్సాంలో చిన్న పార్టీల పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. జై భారత్ పార్టీ వంటి సంస్థలు టీ ట్రైబ్ ప్రాంతాల్లో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. 
 
టీ తోటలు అధికంగా ప్రాంతాల్లో జై భారత్ పార్టీ కొంత కనిపిస్తోంది. వీరికి జేఎంఎం పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తోంది. రంగాపర, సొనారి, మజ్బత్ నియోజకవర్గాల్లో జై భారత్ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయేలోని ఏజీపీకి కేటాయించినవాటిలో అధికంగా ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏజీపీ తన పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించింది. బీజేపీ మాత్రం రాష్ట్రం వ్యాప్తంగా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.

ఓటర్ల అభిప్రాయాలు కూడా స్పష్టంగా ఒక దిశలోనే ఉన్నాయి. 52% మంది రాష్ట్ర అభివృద్ధికి బీజేపీనే మంచిదని భావిస్తుండగా, 60% మంది మళ్లీ అదే ప్రభుత్వం వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 60% మంది మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల వీస్తున్న సానుకూల పవనాలకు నిదర్శనం.
 
గిరిజనులు, ఓబీసీ వర్గాల్లో మద్దతు పెంచుకున్న బిజెపి 

సామాజికంగా కూడా బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. గిరిజనులు, ఓబీసీ వర్గాల్లో మద్దతు పెంచుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలాన్నిచ్చాయి. మరోవైపు అక్రమ వలసలు, అక్రమంగా వచ్చినవారు భూముల ఆక్రమించారనే ఆరోపణలు కూడా రాజకీయ చర్చలో కీలకంగా మారడంతో… అవి  ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయి.

పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం అస్సాంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లో 5000 మందితో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించింది.  కులం, మతం, వయస్సు, లింగం వంటి అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను విశ్లేషకులు, జర్నలిస్టులతో చర్చించి డేటాను క్రాస్ చెక్  చేశారు.

మొత్తానికి చూస్తే, మరికొన్ని రోజుల్లో జరగబోయే 2026 అస్సాం ఎన్నికల్లో ప్రతిపక్షం ఇంకా ఐక్యత లోపంతో పోరాడుతుండగా, బీజేపీ మాత్రం తన నాయకత్వం, సంస్థాగత బలం, ప్రభుత్వంపై ఉన్న సానుకూల అభిప్రాయంతో స్పష్టమైన ఆధిక్యాన్ని నిర్మించుకుంది. ఇదే ధోరణి కొనసాగితే, అస్సాం మరోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుంది!