ఇరాన్‌పై ప్రేముంటే అక్కడికే వెళ్లిపోండి

ఇరాన్‌పై ప్రేముంటే అక్కడికే వెళ్లిపోండి
* షియా ముస్లింలపై పాక్ ఆర్మీ చీఫ్‌ అసహనం 

పశ్చిమాసియాలో ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా దాడులను వ్యతిరేకిస్తున్న ప్రపంచంలోని షియా ముస్లింలు పాకిస్థాన్‌లోనూ షియా మత పెద్దలు ఇరాన్‌పై యుద్ధాన్ని ఖండిస్తున్నారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వారిని ద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇరాన్‌ను చాలా ప్రేమిస్తున్నారా? అయితే.. షియా ముస్లింలంతా ఇరాన్‌ వెళ్లిపోవచ్చు’ అని షియా వర్గాన్ని ఆయన హెచ్చరించారు. 

మునీర్ వ్యాఖ్యలపై మత పెద్దలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా దాడులను నిరసిస్తున్న షియాలను టార్గెట్ చేసిన ఆయన ‘ఇరాన్‌పై అంతగా ప్రేమ ఉంటే ఇక్కడెందుకు ఉన్నారు? ఆ దేశమే వెళ్లిపోండి’ అని మండిపడ్డారు. మునీర్ వ్యాఖ్యలను షియా ముస్లిం మతపెద్దలు తీవ్రంగా తప్పుబట్టారు.

“అమెరికా, ఇజ్రాయేల్‌ తొత్తుగా మారిన అసిమ్ మునీర్ పాకిస్థాన్ ప్రయోజనాలను వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారు” అని షియా ఉలేమా కౌన్సిల్ పాకిస్థాన్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు అల్లామ సయ్యద్ సిబటెన్ హైదర్ సబ్జవారీ విమర్శించారు. పాకిస్థాన్‌ను విడిచి వెళ్లాల్సింది తాము కాదని, అమెరికా, ఇజ్రాయేల్‌కు వంత పాడుతున్న మునీర్‌ వెళ్లాలని ఆయన ధ్వజమెత్తారు.

“మీ గురువులైన అమెరికా, ఇజ్రాయేల్‌పై అమితంగా ప్రేమ ఉంటే మీరే పాకిస్థాన్‌ను వదలి వెళ్లండి” అని అల్లామ సయ్యద్ సిబటెన్ హైదర్ సబ్జవారీ కౌంటర్ అటాక్ చేశారు. ఇరాన్‌పై యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న షియా ముస్లింలు పాకిస్థాన్‌లో నిరసనలు తెలుపుతున్నారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన షియాలు మార్చి తొలివారం కరాచీలో ర్యాలీ నిర్వహించారు.  భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.