దేశంలో ఇంధన కొరత ఏర్పడుతోందన్న ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. భారత్‌కు చెందిన ఎల్‌పీజీ, ముడి చమురు నౌకలు ఒక్కక్కటిగా హర్మూజ్ జలసంధిని దాటుతుండటం ఒకింత ఉపశమనం కలిగిస్తున్నది. తాజాగా మరో రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అనుమతితో జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే రెండు ఎల్‌పీజీనౌకలు సోమవారం ఉదయం హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
త్వరలోనే ఈ నౌకలు దేశీయ పోర్టులకు చేరనున్నాయి. దాంతో దేశీయంగా వంట గ్యాస్ లభ్యత మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఉద్రిక్తతల కారణంగా భారత్‌కు చెందిన నౌకలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మన నౌకలు సురక్షితంగా హర్మూజ్ దాటేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఫలితంగా కొన్ని రోజుల నుంచి భారత నౌకలు ఒక్కొక్కటిగా దేశీయ పోర్టులకు చేరుకుంటున్నాయి.
అయితే, ఇరాన్ సీనియర్ లీడర్ అలీ లారిజానీ మరణం, ఆ దేశ చమురుక్షేత్రాలపై అమెరికా దాడులు వంటి కారణాలతో నౌకల ప్రయాణానికి అనుమతులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తున్నది. తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి, గల్ఫ్‌లో ఉన్న భారత పౌరుల భద్రతను నిర్ధారించుకోవడానికి భారతదేశం అంతర్జాతీయ భాగస్వాములతో సంబంధాలను ముమ్మరం చేసిందని మార్చి 20న ప్రభుత్వం తెలిపింది.
వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలపై ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో, కొనసాగుతున్న సంక్షోభం వల్ల ప్రభావితమైన ఎగుమతిదారులకు మద్దతుగా కేంద్రం రూ. 497 కోట్ల విలువైన సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ఇరాన్ తన భూభాగంలోని ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ షిప్పులు జలసంధి దాటడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయ చమురు కంపెనీలు తమ సరఫరా గొలుసును దెబ్బతినకుండా చూసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగంగా చూడవచ్చు.
భారతదేశం తన ఎల్‌పీజీ అవసరాల కోసం ప్రధానంగా ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఆధారపడుతుంది. ఈ దేశాల నుండి వచ్చే నౌకలు తప్పనిసరిగా హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రత కోసం ‘ఆపరేషన్ సంకల్ప్’ వంటి చర్యల ద్వారా భారత నావికాదళం పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయంగా నౌకలపై దాడులు జరుగుతున్న తరుణంలో భారతీయ జెండా ఉన్న నౌకలకు ఎటువంటి హాని కలగకుండా దౌత్యపరమైన, సైనికపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

More Stories
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం
మంగళూరు చేరుకున్న రష్యా చమురు, అమెరికా గ్యాస్ నౌకలు!
రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య గ్యాస్ కేటాయింపులు