జైళ్లలో రద్దీపై సుప్రీంకోర్టు ఆందోళన

జైళ్లలో రద్దీపై సుప్రీంకోర్టు ఆందోళన

దేశవ్యాప్తంగా జైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో ఖైదీల రద్దీని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు అక్కడ అందుబాటులో ఉన్న వసతులపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా జైళ్లలో స్థితిగతులపై దాఖలైన పిటిషన్‌ను సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం, 

ఈ ఏడాది మార్చి 1 నాటికి జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య, మంజూరైన సామర్థ్యం వంటి వివరాలను మే 18 లోగా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శులను ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఖైదీలతో పాటు వారితోపాటు ఉంటున్న చిన్నారుల భవిష్యత్తుపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

 జైళ్లలో ఆయా చిన్నారులకు అందుతున్న విద్య, ఆరోగ్య సదుపాయాలపై స్పష్టత ఇవ్వాలని కోరింది. జైళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులు, వాటి భర్తీకి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అమికిస్ క్యూరీ అందించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు జైళ్లలో పాలనా సంస్కరణలు అనివార్యమని అభిప్రాయపడింది. 

ఈ విచారణను సమర్థంగా పరిగణనలోకి తీసుకోవడానికి తాజా సమాచారం అందుబాటులో ఉండటం అత్యవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నమోదు చేసిన గణాంకాలు 2023 సంవత్సరానికి సంబంధించినవని తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ కేసు తదుపరి విచారణను మే 26కు వాయిదా వేసింది.