ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం
 
* భారత్ పై స్వల్పకాలిక ప్రభావమే… ఎస్‌బిఐ రీసెర్చ్‌  
 
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం ఉందని ఎస్‌బిఐ రీసెర్చ్‌ తన నివేదికలో వెల్లడించింది. యుద్ధం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే మరింత ద్రవ్యోల్బణ అలజడకి కారణం కావచ్చని హెచ్చరించింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచ ఇంధన రంగం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నివేదిక పేర్కొంది. 

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల్లో అస్థిరత ఏర్పడవచ్చని నివేదిక పేర్కొంది. ఒకవేళ ఈ సంఘర్షణ దీర్ఘకాలం కొనసాగితే ముడి చమురు ధర ప్రతీ 10 డాలర్లు పెరిగినప్పుడు భారత కరెంట్‌ అకౌంట్‌ లోటు (సిఎడి) 36 బేసిస్‌ పాయింట్లు, ద్రవ్యోల్బణం 35-40 బేసిస్‌ పాయింట్లు పెరిగే ప్రమాదం ఉందని నివేదిక అంచనా వేసింది.

”భారత్‌కు సంబంధించి ప్రధానంగా గల్ఫ్‌ దేశాల నుండి వచ్చే విదేశీ నగదు, ముడి చమురు దిగుమతులపై ఈ ప్రభావం స్వల్పకాలికంగా ఉండవచ్చు. భారత్‌ తన ముడి చమురు అవసరాల కోసం సుమారు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలకమైన హర్మూజ్‌ నది మార్గంపై ఆధారపడటం ఇంధన భద్రత పరంగా ఒక సవాలుగా మారింది” అని తెలిపింది. 
 
అయితే, భారత్‌ వ్యూహాత్మకంగా తన చమురు దిగుమతులను ప్రస్తుతం 40 కంటే ఎక్కువ దేశాల నుండి తీసుకుంటుందని నివేదిక గుర్తు చేసింది. ముఖ్యంగా 2022 నుండి రష్యా నుండి దిగుమతులు పెరగడం మనకు రక్షణగా నిలిచిందని పేర్కొన్నది. 
 
మరోవైపు 2025 ఆర్థిక సంవత్సరంలో భారత విదేశీ రెమిటెన్స్‌లు 15 శాతం వృద్ధితో 138 బిలియన్‌ డాలర్లకు చేరాయిని, ఇందులో 38 శాతం వాటా గల్ఫ్‌ దేశాలదే కావడం గమనార్హం అని వివరించింది. ఈ నేపథ్యంలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత విధానపరమైన నిర్ణయాలు సంక్షోభ ప్రభావాన్ని తట్టుకోవడానికి తోడ్పడతాయని ఎస్‌బిఐ రీసెర్చ్‌ పేర్కొంది. 
మరోవంక, యుద్ధం ఇలాగే కొనసాగితే అది ప్రపంచ ఆహార సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా ప్రపంచ ఇంధన రంగంలో ఇది చరిత్రలోనే అతిపెద్ద అంతరాయంగా భావిస్తున్నారు. 1973 అరబ్‌ ఆయిల్‌ సంక్షోభం కంటే కూడా ఇది తీవ్రంగా ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు 400 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు కొరత ఏర్పడింది. దీంతో చమురు ధరలు 50 శాతం వరకు పెరిగి.. బ్యారెల్‌కు 110 డాలర్లు దాటాయి.
పశ్చిమాసియా చమురు ధరలు మరింతగా పెరిగి 160 డాలర్లకు చేరాయి. ఈ ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగాయి. విమాన టిక్కెట్లు ఖరీదయ్యాయి. విద్యుత్‌ చార్జీలు పెరిగే అవకాశముంది. పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి.