సోషల్ మీడియా పరిచయాలతో ఇబ్బందుల్లో యువతులు 

సోషల్ మీడియా పరిచయాలతో ఇబ్బందుల్లో యువతులు 
సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు యువతులను ఊహించని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం ఎంతలా పెరిగిందో, దానివల్ల పొంచి ఉన్న ప్రమాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని  చెబుతూ మొబైల్ ఎంతోమంది అమ్మాయిలపాలిట శాపంగా మారుతోందని విచారం వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా ఆడపిల్లలు, యువతులు అపరిచితులతో పరిచయాలు పెంచుకునేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ రిక్వెస్ట్‌లను గుడ్డిగా యాక్సెప్ట్ చేయవద్దని సీపీ స్పష్టం చేశారు. 
 
సైబర్‌ నేరస్థులు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫొటోలను డీపీలుగా పెట్టి నకిలీ అకౌంట్స్తో అమ్మాయిలకు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ లాంటి వేదికల్లో ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతున్నారని సజ్జనార్ తెలిపారు. వారి మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు గుడ్డిగా నమ్మేసి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారని, అవి పంపగానే ఆ అపరిచితులు రాక్షసుల్లా మారి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని పేర్కొన్నారు. 
 
మార్ఫింగ్‌ చేసి నగదు ఇవ్వాలని లేదా భౌతికంగా కలవాలని వేధింపులకు పాల్పడుతున్నారని, పరువు పోతుందన్న భయంతో ఇంట్లో చెప్పలేక కొందరు అడిగినంత నగదు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని, మరికొందరు ఈ వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వివరించారు.
 
“ఒక చిన్న మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మీ జీవితమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ప్రపంచంలో ఎవరో తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు లేదా ఫోటోలు పంచుకోవడం వల్ల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియా ట్రాప్‌లో పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని, ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.

ఇలాంటి వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, లేదంటే పోలీసులను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. అవసరమైతే 100కు కాల్ చేయాలన్నారు.   పిల్లలతో సమయం గడుపుతూ వారి ఆన్‌లైన్ కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. 

నకిలీ ప్రొఫైల్‌లు, నంబర్లు, విపిఎన్ లతో తప్పించుకోలేరని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. “ఎక్కడ ఉన్నా నిందుతులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు రావాలని మహిళలకు హైదరాబాద్ నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు.