ఉద్రిక్తంగా మారిన బీజేపీ ‘అసెంబ్లీ ముట్టడి’

ఉద్రిక్తంగా మారిన బీజేపీ ‘అసెంబ్లీ ముట్టడి’
* రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో సహా పలువురు నేతల అరెస్ట్ 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా లేవని, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేపట్టిన `అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం రాష్ట్ర రాజధానిలో సోమవారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీయేనని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత లేదని, కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొంటూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో పాటు పలువురు నాయకులను పోలీసులు ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన వేలాది మంది బిజెపి కార్యకర్తలు. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.   

“6 గ్యారంటీలు ఎక్కడ?” అంటూ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.   ప్రజల తరఫున ప్రశ్నించడానికి, వారి వాణిని వినిపించడానికి బిజెపి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడితే తమను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనం అంటూ రామచందర్ రావు ధ్వజమెత్తారు. దాదాపు 9 పోలీస్ స్టేషన్లలో 800కు పైగా బిజెపి కార్యకర్తలను, అందులో 150 మంది మహిళలు, యువమోర్చా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

అర్ధరాత్రి నుంచే బిజెపి నాయకులను గృహనిర్బంధం చేశారని, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వేలాది కార్యకర్తలను మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారని తెలిపారు. “మేం తెలంగాణ ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను నిలదీసి ఎండగట్టేందుకు అసెంబ్లీ ముట్టడి చేపట్టాం” అని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండా కార్తీక రెడ్డి, ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ తదితరులను కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకట్ రమణ రెడ్డి, పాయల్ శంకర్, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అరెస్టు అయిన రాష్ట్ర అధ్యక్షుడురామ్‌చందర్ రావును  కలిసి పరామర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహా సీనియర్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అభద్రతాభావానికి అద్దంపడుతోందని విమర్శించారు.  తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా? లేక పోలీస్ బలగాలతో పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.