నిందితుల ఫోటోలు వెంటనే సోషల్‌ మీడియాలో.. సుప్రీం ఆందోళన

నిందితుల ఫోటోలు వెంటనే సోషల్‌ మీడియాలో.. సుప్రీం ఆందోళన

xr:d:DAGAULvoQ1g:9,j:4746090668103207798,t:24032309

* డిజిటల్ అరెస్టుల్లో ఉపయోగించే డివైస్‌ ఐడీలను వాట్సాప్‌ బ్లాక్‌ చేయాలి 

నిందితుల ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మొబైల్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మీడియాలా తయారయ్యారని వ్యాఖ్యానించింది. ఇలాంటి సోషల్ మీడియా ధోరణి పారదర్శక విచారణకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.  అరెస్టయిన నిందితుల వీడియోలు, ఫొటోలను పోలీసులు అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలలో ఎలా అప్‌లోడ్ చేస్తారని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాలా బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం పంచోలీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. 

అరెస్ట్‌ చేసిన నిందితుల ఫొటోలు, వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తుందని, ఆ నిందితులు నిర్దోషులుగా విడుదలైతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పిల్‌ దాఖలైంది.  ఒక కేసు విషయంలో పోలీసుల మీడియా బ్రీఫింగ్‌పై మార్గదర్శకాలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించిందని, అందులో సోషల్ మీడియాను కూడా చేర్చాలని పిల్‌ వేసిన పిటిషనర్‌ కోరారు.

ఈ పిల్‌పై జరిగిన విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సంకెళ్లు వేసిన, తాళ్లతో బంధించిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన నిందితుల ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడం సదరు వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని, అది ప్రజల ఆలోచనను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నది.  అయితే,  నిబంధనల ద్వారా పోలీసులను నియంత్రించడానికి వీలు ఉంటుందని, కానీ సోషల్ మీడియా, మొబైల్‌ ఫోన్‌ కలిగిన వ్యక్తుల సంగతేంటని, వారిని నియంత్రించగలమా? అని సుప్రీం ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఈ అంశంపై విస్తృత పరిశీలన అవసరం అని అభిప్రాయపడింది. 

మరోవంక, సైబర్‌ మోసాలపై కఠిన చర్యల్లో భాగంగా డిజిటల్‌ అరెస్టు కుంభకోణాల్లో ఉపయోగిస్తున్న పరికరాల(డివైస్‌) ఐడీలను బ్లాక్‌ చేయాలని కేంద్రం శనివారం వాట్సాప్‌ను ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న ముప్పుపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కేంద్ర హోం శాఖ సైబర్‌ విభాగం ఐ4సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

సైబర్‌ మోసగాళ్లు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి తరచుగా కొత్త ఖాతాలను సృష్టిస్తుండడంతో పునరావృత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు పరికర స్థాయి ఆంక్షలను విధించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అంతేగాక వాట్సాప్‌ వంటి ప్లాట్‌ఫారాలపై భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.