హర్మూజ్ జలసంధిని తెరవాలని 20 దేశాల విజ్ఞప్తి

హర్మూజ్ జలసంధిని తెరవాలని 20 దేశాల విజ్ఞప్తి
* 48 గంటల్లో తెరవకపోతే… ట్రంప్ హెచ్చరిక 
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి వెన్నెముక వంటి హర్మూజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కీలక జలమార్గాన్ని తక్షణమే తెరవాలని, యుద్ధాన్ని ఆపాలని కోరుతూ అమెరికా సహా 20కి పైగా శక్తివంతమైన దేశాలు ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బ్రిటన్, యూఏఈ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుంచి 30 శాతం రవాణా అవుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడం లేదా ఇక్కడ వాణిజ్య నౌకలపై దాడులకు దిగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని 20 దేశాల కూటమి హెచ్చరించింది. 

జలసంధి గుండా సురక్షితమైన నౌకాయానాన్ని కొనసాగించేందుకు జరుగుతున్న సమన్వయ ప్రయత్నాలకు తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశాలు తెలిపాయి. ఇప్పటికే ఈ ప్రయత్నంలో ఉన్న దేశాలు కొనసాగిస్తున్న ప్రణాళికలను స్వాగతించాయి. ఇంధన సౌకర్యాలతో సహా పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే, సమగ్రంగా నిలిపివేయాలని కూడా అవి పిలుపునిచ్చాయి.

చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల వల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై దుష్ప్రభావం పడుతోందని ఆయా దేశాలు పేర్కొన్నాయి. యూకే, యూఏఈ, జర్మనీ, ఫ్రాన్స్, బహ్రెయిన్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, కెనడా, ఇటలీ, మరికొన్ని యూరోపియన్ దేశాలు ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈల నుండి వచ్చే చమురు నౌకలు ఈ మార్గం ద్వారానే ఆసియా, ఐరోపా దేశాలకు వెళ్తాయి.

ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే, ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.  యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని 20 దేశాల ప్రతినిధులు ఇరాన్‌కు సూచించారు. ఇరాన్ చర్యల వల్ల కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా, సంబంధం లేని ఆసియా, ఆఫ్రికా దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా,  హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా టెహ్రాన్ పూర్తిగా తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. “ఈ క్షణం నుంచి 48 గంటల్లోగా ఇరాన్ ఎటువంటి ముప్పు లేకుండా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే, అమెరికా వారి వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తాయి. మొదటగా అతిపెద్ద కేంద్రంతో ప్రారంభిస్తాయి,” అని ట్రంప్ తెలిపారు.