ఆత్మాభిమానం చంపుకొని కాంగ్రెస్‌లో కొనసాగలేను

ఆత్మాభిమానం చంపుకొని కాంగ్రెస్‌లో కొనసాగలేను
‘సారీ.. శ్రీధర్‌. ఆత్మాభిమానం చంపుకొని, గౌరవాన్ని వదులుకొని కాంగ్రెస్‌లో కొనసాగలేను. మీకో దండం. మీ పార్టీకో దండం. ఇంతదూరం వచ్చి నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. పార్టీలో కొనసాగడం మాత్రం ఇక జరిగే పనికాదంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి మంత్రులకు స్పష్టంచేశారు.  మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం శనివారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వచ్చి గంటకుపైగా ఆయనతో చర్చలు జరిపారు.
బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, 20 నెలల క్రితం సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోవడం, పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు అధిష్ఠానం, సీఎం రేవంత్‌ మద్దతు పలుకడం తో జీవన్‌రెడ్డి మానసిక వేదనకు గురవుతూ వస్తున్నారు. 
గ్రామ పంచాయతీ ఎన్నికలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, చైర్‌పర్సన్‌ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ వర్గానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రాధాన్యమిచ్చి, జీవన్‌రెడ్డి వర్గానికి ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో కొనసాగడం ఇబ్బందికరంగా ఉన్నదని, ఈ విషయమై ఆలోచిస్తున్నానని జీవన్‌రెడ్డి ప్రకటించడంతో కొద్దిరోజులు గా రాజకీయ సంచలనం సృష్టిస్తున్నది. 

25న జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారన్న విషయం ప్రచారంలోకి రావడం, జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకులతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించి, తన ఒక్కడి బొమ్మతోనే ఫ్లెక్సీలు ఏర్పా టు చేయడం చర్చనీయాంశాలయ్యాయి. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ జీవన్‌రెడ్డికి ఫోన్‌ చేసి పార్టీ మారొద్దని కోరగా, జీవన్‌రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు, పార్టీని వీడటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టంచేశారు. 

ఏఐసీసీ సభ్యుడు వెంకటస్వామి మూడు రోజుల క్రితం జీవన్‌రెడ్డితో మాట్లాడినా ఆయన మెత్తబడలేదు. అధిష్ఠానం ఫోన్ల ద్వారా ఎంతగా నచ్చచెప్పినా జీవన్‌రెడ్డి బెట్టువీడకపోవడంతో మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. గంట సేపు జీవన్‌రెడ్డితో రహస్య చర్చలు జరిపారు. పార్టీ మారొద్దని వారు నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. 

నలభై ఏండ్లుగా సేవ చేసిన తాను, తన కార్యకర్తలు, అనుచరులు పార్టీలో ఇరువై నెలలుగా మానసిక క్షోభకు గురవుతుంటే పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. వలసవాదులకు ప్రాధాన్యత ఇవ్వడం, సొంతవారి గొంతుకోయడం ఏంటని నిలదీసినట్టు తెలిసింది. 

‘జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నప్పుడే రాజీనామా చేస్తానంటే.. మీరే వచ్చి, నన్ను సముదాయించి, ఢిల్లీకి తీసుకువెళ్లారు. మీరు ఇచ్చి న హామీలు ఏమైనా నెరవేర్చారా? పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా? ఇంత అవమానం జరిగాక ఇంకా పార్టీలో ఉం డటం సాధ్యం కాదు’ అని తేల్చిచెప్పినట్టు తెలుస్తున్నది. మంత్రి ఉత్తమ్‌, మీనాక్షీ నటరాజన్‌తో ఫోన్‌లో జీవన్‌రెడ్డితో మాట్లాడించినా, ఆయన పెద్దగా స్పందించకుండానే మిన్నకున్నట్టు సమాచారం.