రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య గ్యాస్ కేటాయింపులు 

రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య గ్యాస్ కేటాయింపులు 
వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచినట్లు తెలుపుతూ  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌ సరఫరాకు సంబంధించి గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో పేర్కొన్న కేంద్రం, ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా చాలా హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్యాంటీన్లు మూతపడటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి నుంచి వాటిని సరఫరా చేస్తామని ప్రకటించింది.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్లో ఇంధన సరఫరాలపై తాత్కాలిక ఒత్తిడి ఏర్పడింది. ఈ ప్రభావంతో ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే ఆ పరిస్థితులు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

ఈ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ కేటాయింపును మరింతగా పెంచుతూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాలకు కేటాయించిన సిలిండర్లలో ముందుగా కోత విధించిన ప్రభుత్వం, ఆ తర్వాత దశలవారీగా వాటిని పునరుద్ధరించింది. తాజాగా మరో 20 శాతం అదనపు కేటాయింపులు జరపడంతో మొత్తం వాణిజ్య సిలిండర్ కేటాయింపు 50 శాతానికి చేరింది.

అయితే ఈ అదనపు కేటాయింపుకు కొన్ని షరతులు విధించారు. వాణిజ్య సంస్థలు చమురు కంపెనీలతో నమోదు చేసుకోవాలి. అలాగే పైప్‌డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటేనే ఈ అదనపు కేటాయింపు సాధ్యమవుతుంది. ఇదిలా ఉండగా, దేశంలో గృహ వినియోగ సిలిండర్ సరఫరా స్థిరంగా ఉందని, పంపిణీ కేంద్రాల వద్దనుంచి ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 

సాధారణ డెలివరీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా, ప్రజలు ఆందోళనలతో చేసే బుకింగ్స్ చాలా వరకు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. వినియోగదారులు సిలిండర్ కోసం పంపిణీ కేంద్రాల వద్ద అనవసరంగా గుమికూడవద్దని, హోం డెలివరీపై ఆధారపడాలని సూచించారు.