ఢిల్లీలో యూఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ఆఫీసు జప్తు 

ఢిల్లీలో యూఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ఆఫీసు జప్తు 
దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా  (యూఎన్ఐ )వార్తా ఏజెన్సీ ఆఫీసును శుక్ర‌వారం రాత్రి మూసివేశారు. పారామిలిట‌రీ ద‌ళాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ ఆఫీసుపై దాడి చేశాయి. సుమారు 50 మంది జ‌ర్న‌లిస్టుల‌ను ఆ ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు గెంటివేశారు. భూ వివాదం నేప‌థ్యంలో కోర్టు ఆదేశాల ప్ర‌కారం ర‌ఫీ మార్గ్‌లో ఉన్న యూఎన్ఐ ఆఫీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం లాండ్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ ఆఫీసర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు యూఎన్ఐ సిబ్బందిని ఖాళీ చేయించిన‌ట్లు డిప్యూటీ క‌మీష‌న‌ర్ స‌చిన్ శ‌ర్మ తెలిపారు.  అయితే త‌మ‌కు ఎటువంటి నోటీసు ఇవ్వ‌లేద‌ని యూఎన్ఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. బ‌ల‌వంతంగా ఆఫీసును ఖాళీ చేయించిన‌ట్లు ఆ సంస్థ ఆరోపించింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై చేయిచేసుకున్నారని, వారిని బలవంతంగా బయటకు నెట్టేశారని, మహిళా జర్నలిస్టులపట్ల కూడా అభ్యంతరకరంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. 
రాత్రి పొద్దుపోయిన తరువాత అకస్మాత్తుగా కొంతమంది ప్రభుత్వ అధికారులు, ఢిల్లీ పోలీసులు, వందల మంది పారామిలిటరీ బలగాలు, అధికారులు సుమారు 300 మంది ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఉద్యోగులను వెంటనే న్యూస్‌రూమ్‌ను ఖాళీ చేసి ప్రాంగణం నుండి బయటకు వెళ్లమని ఒత్తిడి చేశారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా బయటకు వెళ్లకపోతే బలప్రయోగం చేయాల్సి వస్తుందని వారు బెదిరించారు. ఈ సంఘటన కలకలం రేపింది.
యాజమాన్యానికి తెలపాలని, వారు వచ్చేంత వరకు ఆగాలని, ఆ మేరకు కొంత సమయం కావాలని ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు అడిగినా వినిపించుకోకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కొంద‌రు ఉద్యోగుల‌ను ఈడ్చుకెళ్లారని యూఎన్ఐ పేర్కొన్న‌ది. న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన భూకేటాయింపును ర‌ద్దు చేయ‌డంతో శుక్ర‌వారం రాత్రి పోలీసుల యూఎన్ఐ ఆఫీసును జప్తు చేశారు.
కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హార‌ల మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో యూఎన్ఐ ఆఫీసును ఆధీనంలోకి తీసుకున్నారు. ప్ర‌భుత్వ చ‌ర్య పత్రికా స్వేచ్ఛ‌పై దాడిగా యూఎన్ఐ పేర్కొన్న‌ది. నాలుగు ద‌శాబ్ధాల క్రితం కేటాయించిన భూమిపై ఏజెన్సీ ఇంత వ‌ర‌కు నిర్మాణం చేప‌ట్ట‌లేద‌ని హైకోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది.1979 భూ కేటాయింపు చ‌ట్టం ప్ర‌కారం భూమి తీసుకున్న రెండేళ్ల‌లోనే నిర్మాణాన్ని చేప‌ట్టాలి, కానీ యూఎన్ఐ ఆ ప‌నిచేయ‌లేద‌ని హైకోర్టు వెల్ల‌డించింది.
కార్యాలయాన్ని ఆకస్మికంగా మూసివేయడంతో యూఎన్ఐ వార్తల ప్రసారం తక్షణమే నిలిచిపోయింది. ఈ ఏజెన్సీ 500 మందికి పైగా చందాదారులకు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో సేవలను అందిస్తుంది. నిమిషాల వ్యవధిలోనే అదంతా ఆగిపోయింది. దీనివల్ల పలు మాధ్యమాలలో వార్తల పంపిణీకి అంతరాయం కలిగింది. ఈ సంఘటన మీడియా వర్గాలలో ఆందోళనను రేకెత్తించింది.