* రాజీనామా బాటలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్?
ఇరాన్‌పై యుద్ధానికి సంబంధించిన కారణాల విషయంలో అమెరికా ప్రభుత్వంలోనే విభేదాలు బయటపడుతున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారులు, వైట్‌హౌజ్ ఇచ్చిన వివరణలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో యుద్ధం న్యాయసమ్మతతపై పెద్ద ప్రశ్నలే తలెత్తుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్‌ఐ) తులసీ గబ్బార్డ్ తన లిఖితపూర్వక నివేదికలో ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు. అయితే అదే విషయాన్ని సభలో మాట్లాడినప్పుడు ఆమె ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని సెనెటర్ మార్క్ వార్నర్ వెంటనే ప్రశ్నించారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆ కీలక అంశాన్ని వదిలేయడం ద్వారా ప్రభుత్వం యుద్ధానికి ఇచ్చిన కారణాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తోంది.
ఇరాన్ అణుకార్యక్రమం ఇప్పటికే నిర్వీర్యమై ఉంటే ‘అత్యవసర ముప్పు’ పేరుతో యుద్ధం ప్రారంభించడాన్ని ఎలా సమర్థించగలరు? అన్నదే ఇక్కడ ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. ఇంకా పరిస్థితిని క్లిష్టం చేసే విషయం ఏమిటంటే ఉన్నతాధికారులు ఉపయోగించిన పదజాలమని కూడా తెలుస్తోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మ్యాక్రో రూబియో మరో కోణంలో స్పందిస్తూ ఈ యుద్ధాన్ని ఇజ్రాయిల్ దాడికి ముందస్తు చర్యగా వివరించారు.
ఈ విధంగా కీలక అధికారులు వేర్వేరు వివరణలు ఇవ్వడం వల్ల ప్రభుత్వం లోపలే ఒక అస్పష్టత, విభేదాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక అంతర్గత అసంతృప్తి కూడా బయటపడుతోందని అంటున్నారు. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ రాజీనామా చేయడం కూడా ఇదే నేపథ్యంలో జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు రాసిన తన రాజీనామా లేఖలో జో కెంట్ వివరించిన విషయం విదితమే.
కాగా, తులసీ గబార్డ్ కూడా తన పదవికి రాజీనామా చేయబోతున్నారని అమెరికన్ రైటిస్ట్ లారా లూమర్ ‘ఎక్స్’ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తులసీ నిష్క్రమణ అనివార్యమని ఆమె సలహాదారుల్లో ఒకరు భావిస్తున్నట్టు ఆ పోస్ట్ పేర్కొన్నది. ఇటీవల అమెరికా కాంగ్రెస్ ముందు హాజరైన తులసీ, ఎక్కడా కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుగా మాట్లాడలేదన్న పైగా నిర్ణయాల్ని ఆమె వ్యతిరేకించినట్టు లూమర్ చెప్పారు. తులసీ గబార్డ్ దగ్గరే కీలకమైన అధికారిగా పనిచేసిన ‘జో కెంట్’ రాజీనామా చేసి వెళ్లిపోగా, అతడి బాటలోనే ఆమె వెళ్లనున్నారని వ్యాఖ్యలు చేశారు.
ఈ యుద్ధంపై విమర్శలు రాజకీయ వర్గాల్లో కూడా పెరుగుతున్నాయి. ప్రముఖ కన్జర్వేటివ్ నేతలు టకర్ కార్ల్‌సన్, మార్జోరీ టేలర్ గ్రీనె ఈ దాడులను వ్యతిరేకించారు. అలాగే సెనెటర్ రాండ్ పాల్ రాజ్యాంగపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం కేవలం యుద్ధభూమిలోనే కాకుండా అమెరికా రాజకీయ వ్యవస్థలో కూడా జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణకు వారు చెప్తున్నారు. అధికారుల మాటల్లో తేడాలు, దాచిన విషయాలు… ఇవన్నీ కలిపి ఈ యుద్ధంపై విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని అంటున్నారు.

More Stories
జ్యోతిష్కుడి వివాదంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాజీనామా
8 నుంచి పెరగనున్న బ్రిటన్ వీసా, సెటిల్మెంట్ ఫీజులు
అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక అనుమతి నిరాకరణ