కాంగ్రెస్ అస్సాం ఎన్నికల ఇన్ ఛార్జ్ గా ప్రియాంకకు చుక్కెదురు

కాంగ్రెస్ అస్సాం ఎన్నికల ఇన్ ఛార్జ్ గా ప్రియాంకకు చుక్కెదురు
* నెల రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు- మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ బీజేపీలో చేరిక 
 
ఒక నెల వ్యవధిలోనే అస్సాం కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు – లోక్‌సభ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా బీజేపీలో చేరడం, ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దెబ్బతీయడమే కాకుండా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను కూడా తీవ్రంగా కుదిపేసింది. 
 
అస్సాంలో పార్టీ వ్యవహారాల్లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికను పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది మే నెలలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన లోక్‌సభ ఎంపీ గౌరవ్ గోగోయ్‌ను అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం, అసెంబ్లీ ఎన్నికలలో ప్రియాంకకు కీలక పాత్ర కల్పించడం వంటి చర్యలను, దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీజేపీ నుండి రాష్ట్రాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందనడానికి సంకేతాలుగా భావించారు.
 
అయితే, గోగోయ్ నియామకం కాంగ్రెస్ శ్రేణులలో అసంతృప్తికి కారణమవుతోంది. 2015లో పార్టీని వీడిన మాజీ కాంగ్రెస్ నాయకుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఫిరాయింపుల వెనుక సూత్రధారి అని ఏఐసీసీలోని కొన్ని వర్గాలు ఆరోపిస్తుండగా, రాష్ట్ర విభాగంలో కుళ్లు చాలా లోతుగా పాతుకుపోయిందని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు.
అభ్యర్థుల ఎంపిక, ప్రచార నిర్వహణ రెండింటిలోనూ గోగోయ్ ‘ఏకపక్షంగా’ వ్యవహరిస్తున్నారని చాలా మంది నాయకులు ఆరోపిస్తున్నారు.
“అతను (గౌరవ్) ఎవరినీ నమ్మడు. ప్రతి ఒక్కరూ హిమంత ఏజెంట్లే అని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలు నిర్వహించే బాధ్యతను పార్టీ (రాజకీయ వ్యూహకర్త) సునీల్ కనుగోలుకు అప్పగించినప్పటికీ, గౌరవ్ తన సొంత సర్వే కోసం మరో ఏజెన్సీని రంగంలోకి దించినట్లు మాకు తెలిసింది. అంతేకాక, అభ్యర్థుల ఎంపిక కోసం డబ్బు చేతులు మారిందనే నిరాధారమైన వదంతులు కూడా ఉన్నాయి,” అని ఒక ఏఐసీసీ నాయకుడు తెలిపారు.
 
 కాంగ్రెస్ నుండి జరిగిన ఉన్నత స్థాయి ఫిరాయింపులు, ఉత్తర ప్రదేశ్ వెలుపల మరో రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించడానికి ప్రియాంక చేసిన తొలి ప్రయత్నంపై నీలినీడలు కమ్మేలా చేశాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్‌ల వెనుక సంవత్సరాల తరబడి నిశ్శబ్ద తెరవెనుక శక్తిగా పనిచేసిన తర్వాత, 2019 లోక్‌సభ ఎన్నికలకు తూర్పు ఉత్తరప్రదేశ్‌కు ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణలో చేసిన మొదటి ప్రయత్నం ఘోరంగా విఫలమైంది.
 
యూపీలోని 80 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా రాయ్‌బరేలీలో సోనియా. అలాగే, తమ కుటుంబ కంచుకోట అయిన అమేథీలో రాహుల్ కూడా ఓడిపోయారు. మూడేళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిస్థాయి ఎన్నికల నిర్వాహకురాలిగా, ప్రచారకర్తగా ప్రియాంక చేసిన మొదటి ప్రయత్నంలో కూడా విఫలమయ్యారు. 
 
“నేను అమ్మాయిని, పోరాడగలను” (లడ్కీ హున్, లడ్ సక్తీ హున్) అనే నినాదంతో మహిళా ప్రాధాన్య ప్రచారం చేసినప్పటికీ, రాష్ట్రంలోని 403 స్థానాలకు గాను పార్టీ కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకోగలిగింది. ఇప్పుడు అస్సాంలో ఆమె ఒక పూర్తిస్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. బోర్డోలోయ్ విషయంలో జరగబోయేది స్పష్టంగా తెలిసినప్పటికీ, కాంగ్రెస్‌తో దశాబ్దాల అనుబంధం కారణంగా ఆయన పార్టీ మారరని ప్రియాంక, కాంగ్రెస్ పార్టీ ఆశించాయి. నాగావ్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన, అస్సాంలో గతంలో తరుణ్ గోగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలలో మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
 
కానీ, పరిస్థితులు అంతకంటే చాలా క్లిష్టంగా ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు నెలల క్రితం అస్సాం కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశంలో, గౌరవ్ గోగోయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, తాను, ఇతర సీనియర్ నాయకులు ఆయన కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బోర్డోలోయ్ చెప్పి ఏఐసీసీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ఆశ్చర్యపరిచారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. 
 
అప్పుడు ఏఐసీసీ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, గోగోయ్ పనితీరు పట్ల బోరా, బోర్డోలోయ్ ఇద్దరూ అసంతృప్తిగా ఉన్నారు. “బోర్డోలోయ్ ఏపీసీసీ అధ్యక్ష, ముఖ్యమంత్రి పదవుల రేసులో లేరని చెబుతున్నప్పటికీ, గోగోయ్‌ను వాస్తవంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న ఏఐసీసీ నిర్ణయం అసంతృప్తిని రేకెత్తించిందన్నది విస్మరించలేని వాస్తవం. తరుణ్ గోగోయ్‌కు 80 ఏళ్లు పైబడ్డాయి, గౌరవ్‌కు ఇంకా 40 ఏళ్లే. 50, 60 ఏళ్ల వయసులో ఉన్న నాయకుల తరం ఒకటి ఉంది, వారు నిరాశకు గురయ్యారు,” అని ఒక రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. 
 
రాబోయే ఎన్నికల కోసం బోరా పార్టీ ప్రచార కమిటీకి అధిపతిగా, బోర్డోలోయ్ మేనిఫెస్టో ప్యానెల్‌కు నేతృత్వం వహించడం కాంగ్రెస్‌లో మరింత ఆందోళనను రేకెత్తించింది. “మేము మా మేనిఫెస్టోను ఏ ముఖంతో విడుదల చేస్తాం? మా ప్రచార కమిటీ అధిపతి బీజేపీలో చేరిన నెల రోజులకే, మా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ స్వయంగా అవతలి పక్షంలోకి వెళ్లిపోయారు,” అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
బోర్డోలోయ్ నిష్క్రమణకు తక్షణ కారణం, ఆయన నాగావ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లహరిఘాట్ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో తలెత్తిన విషయమే. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆసిఫ్ మహమ్మద్ నజర్‌ను మళ్లీ బరిలోకి దించడాన్ని ఆయన వ్యతిరేకించారు. “మేము ఇంకా ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. బోర్డోలోయ్ రాజీనామా నిర్ణయానికి వేరే కారణాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను,” అని ఒక ఏఐసీసీ నాయకుడు చెప్పారు.
 
ఆదివారం నాడు ఏఐసీసీ అస్సాం వ్యవహారాల ఇన్‌చార్జ్ జితేంద్ర సింగ్‌కు రాసిన లేఖలో, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ జరిపిన సంప్రదింపుల సమయంలో తాను “అవమానానికి గురయ్యానని” బోర్డోలోయ్ పేర్కొన్నారు. తనపై దాడి చేసినందుకు అరెస్టు అయిన ఒక వ్యక్తికి, నజర్ అనే నాయకుడు అండగా నిలుస్తున్నారన్న తన ఆందోళనలను పార్టీ సీరియస్‌గా తీసుకోలేదని కూడా ఆయన ఆరోపించారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ “బోర్డోలోయ్‌కి అన్నీ ఇచ్చిందని” సింగ్ వ్యాఖ్యానించారు. “ఆయన కాంగ్రెస్ నుండి విడిపోయి, బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరం,” అని ఆయన తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2022లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున ఖర్గేపై పోటీ చేసిన తన సహ లోక్‌సభ సభ్యుడు శశి థరూర్ అభ్యర్థిత్వానికి బోర్డోలోయ్ తన పూర్తి మద్దతును ప్రకటించారు.