`అసభ్య పాట’పై నోరా ఫతేహి, సంజయ్ దత్‌లకు ఎన్సిడబ్ల్యు సమన్లు

`అసభ్య పాట’పై  నోరా ఫతేహి, సంజయ్ దత్‌లకు ఎన్సిడబ్ల్యు సమన్లు
`కెడి: ది డెవిల్’ చిత్రంలోని ఇటీవల విడుదలైన `సర్కే చునార్ తేరి సర్కే’ పాటలో అసభ్యత, అశ్లీలత ఉన్నాయంటూ వచ్చిన మీడియా కథనాలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సి డబ్ల్యు) సుమోటోగా పరిగణనలోకి తీసుకుని, గురువారం నాడు నటీనటులు నోరా ఫతేహి, సంజయ్ దత్‌లకు సమన్లు జారీ చేసింది.  ఈ పాటలో అభ్యంతరకరమైన, లైంగికపరమైన స్పష్టమైన సాహిత్యం ఉందని, అలాగే వీక్షకులను, ముఖ్యంగా పిల్లలను బాధించేలా అవాంఛనీయ దృశ్యాలు ఉన్నాయని వచ్చిన పలు ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నారు. 
`తత్తిరి/తతిహరి’   అనే  పాట విషయంలో గాయకుడు, గేయ రచయిత బాద్‌షాకు కూడా ఇదే విధమైన సమన్లు జారీ అయ్యాయి.  “ప్రాథమికంగా చూస్తే, ఈ కంటెంట్ లైంగికపరమైన సూచనలతో కూడి, అభ్యంతరకరంగా, భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం, అలాగే పోస్కో చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించేలా కనిపిస్తోంది,” అని కమిషన్ పేర్కొంది. “నటి నోరా ఫతేహి, రకీబ్ ఆలం, నటుడు సంజయ్ దత్, వెంకట్ కె నారాయణ (నిర్మాత, కెవిఎన్ గ్రూప్), కిరణ్ కుమార్ (దర్శకుడు) లకు సమన్లు జారీ చేయబడ్డాయి. మార్చి 24న కమిషన్ ముందు హాజరు కావాలని వారిని కోరారు,” అని కమిషన్ తెలిపింది. 
 
విడుదలైన వెంటనే, `సర్కే చునార్’ పాట సినీ పరిశ్రమ వర్గాల నుండి,  సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంది. విమర్శకులు ఈ పాట సాహిత్యాన్ని, నృత్య దర్శకత్వాన్ని అసభ్యకరంగా అభివర్ణించారు.  ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. ఇది వినోద రంగంలో సృజనాత్మక స్వేచ్ఛ, బాధ్యతలకు ఉండాల్సిన పరిమితులపై చర్చలకు దారితీసింది. ఎన్ సి డబ్ల్యు జారీ చేసిన ఈ సమన్లు ఈ వ్యవహారంలో ఒక కీలక మలుపుగా పరిణమించాయి.
 
దీనితో ఈ అంశం న్యాయపరమైన, నియంత్రణాపరమైన పరిశీలనల పరిధిలోకి వచ్చింది. అశ్లీలత, మహిళల చిత్రణకు సంబంధించిన ప్రస్తుత చట్టాల ప్రకారం, తదుపరి చర్యలు అవసరమా? కాదా? అని నిర్ధారించడానికి కమిషన్ ఈ ఫిర్యాదులను సమీక్షించనుంది. `కెడి: ది డెవిల్’  చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ పాట చుట్టూ రేగిన వివాదం ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 
 
`తత్తీరి/తతిహారి’ పాటలో కూడా అసభ్యకరమైన కంటెంట్ ఉందన్న ఆరోపణలను కూడా ఈ మహిళా హక్కుల సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఈ పాట విషయంలో గాయకుడు-గేయ రచయిత బాద్‌షా, దర్శకులు మహి సంధు. జోబన్ సంధు, అలాగే నిర్మాత హితేన్‌లకు సమన్లు జారీ చేసి, కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. “సంబంధిత పత్రాలతో సహా మార్చి 25న కమిషన్ ముందు హాజరు కావాలని వారిని కోరారు,” అని కమిషన్ జోడించింది.