ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్‌జీసీ ప్రతినిధి అలీ మొహమ్మద్ మృతి

ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్‌జీసీ ప్రతినిధి అలీ మొహమ్మద్ మృతి

ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్)కు చెందిన అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మరణించాడు. ఈ విషయాన్ని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం తెలిపింది.  ఉగ్రవాదులైన అమెరికా, జియోనిస్టులు జరిపిన దాడిలో తమ జనరల్ నైని వీరమరణం పొందారని ఐఆర్‌జీసీ ప్రకటించింది.

ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనితోపాటు సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ అబ్దోల్ రహిమ్ మౌసావి, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నసీర్జాదే వంటి ఇతర కీలక నేతలు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సంగతి తెలిసిందే.  మరోవైపు తాము మాత్రం యుద్ధాన్ని ఆపేది లేదని ఇరాన్ ప్రకటించింది. శతృవు అలసిపోయే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని ఐఆర్‌జీసీ తెలిపింది.
అమెరికాకు చేతనైతే యుద్ధనౌకల్ని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మోహరించాలని గతంలో నైని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సవాల్ విసిరాడు. తమ దగ్గర మిస్సైళ్లకు కొరత లేదని, యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా తాము మిస్సైల్స్ తయారు చేశామని ఇటీవలే నైని ప్రకటించారు. అంతకుముందు అమెరికాకు చెందిన ఎఫ్‌-35 అనే యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ విడుదల చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు కొనసాగిస్తూ ఉంది.

కాగా, ఇరాన్ పాలకుల అణ్వాయుధ కలలను, క్షిపణి సామర్థ్యాన్ని నాశనం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని ఇజ్రాయిల్ ప్రధాని  నెతన్యాహు తెలిపారు.  ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్ వ్యవస్థలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. కేవలం ఆయుధాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటిని తయారు చేసే పారిశ్రామిక పునాదులను కూడా ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుందని ఆయన వెల్లడించారు. 

 
వందలాది క్షిపణి లాంచర్లు ఇప్పటికే ధ్వంసమయ్యాయని, ఇరాన్ గర్వపడే బాలిస్టిక్ క్షిపణి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయని నెతన్యాహు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగాయని, తద్వారా ఆ దేశం అణ్వాయుధ దేశంగా ఎదగకుండా అడ్డుకోగలిగామని ఆయన స్పష్టం చేశారు.