పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయి. డ్రోన్లు, క్షిపణుల దాడులతో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక అడ్వైజరీ జారీ చేసింది.ఆ అడ్వైజరీ ప్రకారం, పశ్చిమాసియాలోని తొమ్మిది దేశాల గగనతలాన్ని భారత విమానయాన సంస్థలు పూర్తిగా నివారించాలని స్పష్టం చేసింది.
నో-ఫ్లై జోన్‌గా ప్రకటించిన ఈ జాబితాలో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏ ఎత్తులోనైనా విమానాలు ప్రయాణించకూడదని డీజీసీఏ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జరుగుతున్న సైనిక దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఈ ప్రాంత గగనతలం పౌర విమానాలకు అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని లక్ష్యాలపై దాడులు జరిపిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడంతో, యుద్ధ ముప్పు పెరిగింది. ఈ పరిస్థితుల్లో, భారత విమానయాన సంస్థలు నో-ఫ్లై జోన్‌గా పేర్కొన్న దేశాల గగనతలాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలని ఆదేశించింది.
అయితే, భారత్ నుంచి యూరప్, ఇతర పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలకు ఈ మార్గం కీలకం కావడంతో, పూర్తిగా విమాన సర్వీసులను నిలిపివేయడం సాధ్యం కాదని గుర్తించింది. ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియా, ఒమన్ గగనతలాల వినియోగానికి కొన్ని షరతులతో మినహాయింపులు ఇచ్చింది. ఈ రెండు దేశాల గగనతలంలో ప్రయాణించే విమానాలు కనీసం 32,000 అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణించాలని ఆదేశించింది.
అత్యాధునిక క్షిపణులు, డ్రోన్ల ఉనికి పౌర విమానాలకు ముప్పు కలిగిస్తుందని డీజీసీఏ హెచ్చరించింది. విమానాలను తప్పుగా గుర్తించే లేదా అవి సైనిక కార్యకలాపాలలో పాలుపంచుకునే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి విమానయాన సంస్థలు పశ్చిమ ఆసియా దేశాలకు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. యూరప్, అమెరికాకు వెళ్లే విమానాలను ఎక్కువ దూరాలున్న సురక్షిత మార్గాలకు మళ్లిస్తారు.
దీనివల్ల ప్రయాణ సమయాలు పెరుగుతాయి. ప్రస్తుత మార్గదర్శకాలు మార్చి 28 వరకు అమలులో ఉంటాయని, పరిస్థితిని అంచనా వేసిన తర్వాత వాటిని సవరిస్తామని డీజీసీఏ తెలిపింది. సిరియా, యెమెన్ గగనతలాన్ని నివారించాలన్న మునుపటి ఆదేశం ఇప్పటికీ అమలులో ఉంది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, టిక్కెట్ల ధరలను అధికంగా పెంచకుండా చూసుకోవాలని విమానయాన సంస్థలకు సూచించారు.

More Stories
హోర్ముజ్ జలసంధిలో 22 భారత నౌకల కోసం నావికాదళం
ఉగ్ర కుట్ర చేధింపు.. పాక్‌కు సాయం చేస్తున్న ఇద్దరు అరెస్ట్
యువ గ్రాడ్యుయేట్లలో 40 శాతం నిరుద్యోగులే