యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు. శతాబ్ద కాలంగా క్రియాయోగానికి సంబంధించి వై ఎస్ ఎస్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానందకు చిరంజీవి హైదరాబాదులో ఓ మీడియా సంస్థ తరఫున ఉగాది పురస్కారాన్ని అందజేశారు. స్వామీజీకి శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా స్వామి స్మరణానంద మాట్లాడుతూ మనసుకు, శ్వాసకు సంబంధం ఉందని తెలిపారు. శ్వాసను నియంత్రించడం ద్వారా ఆలోచనలను ప్రభావితం చేయవచ్చని, మనసును అదుపులో పెట్టుకోవచ్చని చెప్పారు. క్రియాయోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద 1917లో వైఎస్ఎస్ ను స్థాపించారని ఆయన గుర్తు చేశారు.
క్రియాయోగ ధ్యానానికి సంబంధించిన పాఠాలను వై ఎస్ ఎస్ నుంచి పోస్ట్ ద్వారా పొందవచ్చని స్వామీజీ సూచించారు. స్వామి స్మరణానంద ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థిగా ఉన్నప్పుడే పరమహంస యోగానంద రచనల వైపు ఆకర్షితులయ్యారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా ఆధ్యాత్మిక రంగంలోనే కొనసాగాలనుకుని వై ఎస్ ఎస్ లో చేరారు. నాలుగు దశబ్దాలుగా సేవలందిస్తున్నారు.
వై ఎస్ ఎస్ సంస్థ తరపున అనేక విద్య, సేవాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాచీన కాలం నాటి క్రియాయోగాన్ని వై ఎస్ ఎస్ గురుపరంపర జన బాహుళ్యంలోకి తీసుకువచ్చింది. పరమహంస యోగానంద 1920 నుంచి అమెరికా, యూరప్ దేశాల్లో క్రియాయోగ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు.

More Stories
తెలంగాణాలో ఆర్ఎస్ఎస్ శతాబ్దిలో 375 కొత్త శాఖలు
వేద మంత్రాలను హేళన చేసిన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి
బాధితులైన బిజెపి కార్యకర్తలపై కౌంటర్ కేసులు పెడతారా?