మమతా ఈడీ సోదాలను అడ్డుకోవడంపై సుప్రీంకోర్టు అసహనం 

మమతా ఈడీ సోదాలను అడ్డుకోవడంపై సుప్రీంకోర్టు అసహనం 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భారత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు ఈడీ దాడులు జరుగుతుంటే, అక్కడికి దూసుకెళ్లి, దాడుల్ని అడ్డుకుంటారా అంటూ మండిపడింది. ఐప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ చీఫ్ ఇంటిపై ఈడీ దాడుల సందర్భంగా మమతా బెనర్జీ అడ్డు తగిలిన సంగతి తెలిసిందే. దీనిపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బుధవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ఆధ్వర్యంలోని బెంచ్ కీలక ఆగ్రహం వ్యక్తం చేసింది.

గత జనవరి 8న పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో ఐ ప్యాక్ సంస్థ ఆఫీసులపై, ఆ సంస్థ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఒక మనీ లాండరింగ్ కేసుపై విచారణలో భాగంగా ఈ దాడులు చేసింది. అయితే, ఈ దాడుల సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హైడ్రామా నడిపారు. దాడులు జరుగుతున్న ఐ ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లి ఈడీ కార్యకలాపాలకు అడ్డు తగిలారు. 

అంతేకాదు  ప్రతీక్ జైన్‌కు సంబంధించిన ల్యాప్‌టాప్, ఇంకొన్ని కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. అక్కడ్నుంచి ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ కూడా ఈడీ దాడుల్ని అడ్డుకుని, ఇంకొన్ని డాక్యుమెంట్లు తీసుకుని మమత వెళ్లిపోయారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.   ఈవిధంగా వ్యవహరించినందుకు ముఖ్యమంత్రి మమతపై, ఆమెతో కలిసి ఈడీ దర్యాప్తుకు అంతరాయం కలిగించిన రాష్ట్ర అధికారులపై పోలీసు కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.

ఈ కేసు విచారణ సందర్భంగా మమత తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మమత విచారణకు అడ్డుతగలడం మంచి పరిణామం కాదని వ్యాఖ్యానించింది.  ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యకలాపాలకు ఒక రాష్ట్ర సీఎం అడ్డుతగులుతారా? దీనికి పరిష్కారం ఏంటి? మరో సీఎం కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటి? దీనికి పరిష్కారం ఉన్నప్పుడు మేం సరైన రీతిలో స్పందించాల్సిందే’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

 కోర్టు వ్యాఖ్యలపై మమత, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తరఫు లాయర్ శ్యామ్ దివాన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్‌ను దాఖలు చేసే అవకాశాన్ని ఒక కేంద్ర ప్రభుత్వ విభాగానికి కల్పించడం అనేది దేశ సమాఖ్య వ్యవస్థకు ముప్పు లాంటిదని శ్యామ్ దివాన్ పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని కోరారు. 

అయితే, ఈడీ తరఫు న్యాయవాది తుషార్ మెహతా దీన్ని ఖండించారు. విచారణ ఆలస్యం చేసేందుకే ప్రభుత్వం సమయం అడుగుతోందని తెలిపారు. దీంతో తాము తగిన ప్రొసీడింగ్స్‌తో విచారణ కొనసాగిస్తామని పేర్కొంటూ కోర్టు ఏం చేయాలో మీరు చెప్పకూడదని మమత తరఫు లాయర్‌కు కోర్టు సూచించింది.

కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా దర్యాప్తు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలపై పిటిషన్లు వేసే అవకాశాన్ని కల్పిస్తే, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని న్యాయవాది శ్యామ్ దివాన్ చెప్పారు. దీనివల్ల దేశ సమాఖ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కారానికి నోచుకోని న్యాయవివాదాలకు దారితీస్తుందని తెలిపారు. ఇక ఈ కేసుపై తదుపరి వాదనలను మార్చి 24న వింటామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.