స్వ‌దేశీ విమానాల్లో 60 శాతం సీట్ల‌పై అద‌న‌పు ఛార్జీలు ఉండరాదు

స్వ‌దేశీ విమానాల్లో 60 శాతం సీట్ల‌పై అద‌న‌పు ఛార్జీలు ఉండరాదు
స్వ‌దేశీ విమాన ప్ర‌యాణికుల‌కు భారీ ఊర‌ట క‌ల్పించింది కేంద్ర ప్ర‌భుత్వం. స్వ‌దేశీ విమానాల్లో 60 శాతం సీట్ల‌పై అద‌న‌పు ఛార్జీలు వ‌సూల్ చేయ‌రాదని ఎయిర్‌లైన్స్ సంస్థ‌ల‌ను ఆదేశించింది. ఇక ఒకే పీఎన్ఆర్ నెంబ‌ర్ మీద ప్ర‌యాణం చేస్తున్న కుటుంబ‌స‌భ్య‌లు ఒకే ద‌గ్గ‌ర కూర్చునేలా ఏర్పాటు చేయాల‌ని సివిల్ ఏవియేష‌న్ మంత్రిత్వ‌శాఖ త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో వెల్ల‌డించింది. 
 
ప్ర‌యాణికుల‌కు మ‌రింత సౌక‌ర్యాన్ని అందించే ఉద్దేశంతో ఈ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు మంత్రి రామ్మోహ‌న్ నాయుడు వెల్ల‌డించారు. విమాన ప్ర‌యాణానికి చెందిన కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ బుధవారం ప్ర‌క‌టించింది.  ప్ర‌తి ప్ర‌యాణికుడికి ఫెయిర్ యాక్సెస్ ఉండేందుకు 60 శాతం సీట్ల‌కు బుకింగ్ స‌మ‌యంలో ఎటువంటి అద‌న‌పు ఛార్జీలు వ‌సూల్ చేయ‌వ‌ద్దు అని డీజీసీఏ పేర్కొన్న‌ది. 
 
ప్ర‌స్తుతం కేవ‌లం 20 శాతం సీట్లు మాత్ర‌మే ఎటువంటి ఛార్జీలు లేకుండా సీట్లు బుక్ చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది. ఒకే పీఎన్ఆర్ నెంబ‌ర్‌పై ప్ర‌యాణించే వారు వీలైనంత వ‌ర‌కు ప‌క్క‌ప‌క్క సీట్ల‌లో కూర్చునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని విమాన‌యాన శాఖ తెలిపింది. కేవ‌లం స్వ‌దేశీ విమానాల‌కు మాత్ర‌మే ఈ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు వ‌ర్తించ‌నున్న‌ట్లు అధికారులు చెప్పారు. సీట్ల‌ను బుక్ చేసుకునే స‌మ‌యంలో కొన్ని విమాన సంస్థ‌లు  కొన్ని త‌ర‌హా సీట్ల‌కు అధిక ఛార్జీలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
ఈ నేప‌థ్యంలో కొత్త నిబంధ‌న‌లను ప్రకటించారు. విమాన ప్ర‌యాణికుల సౌక‌ర్యం కోసం కొన్ని చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు  సివిల్ ఏవియేష‌న్ శాఖ మంత్రి కే రామ్మోహ‌న్ నాయుడు త‌న ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు.  ఆల‌స్యం జ‌రిగినా, విమానం ర‌ద్దు అయినా అలాంటి కేసుల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. స్వ‌దేశీ విమాన సేవ‌ల్లో ప్ర‌పంచంలోనే భార‌త్ మూడ‌వ స్థానంలో ఉన్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.