యువ గ్రాడ్యుయేట్లలో 40 శాతం నిరుద్యోగులే 

యువ గ్రాడ్యుయేట్లలో 40 శాతం నిరుద్యోగులే 
దేశంలో 20 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల 6.30 కోట్ల మంది పట్టభద్రుల్లో 1.10 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో కేవలం కొద్ది మంది మాత్రమే డిగ్రీ పొందిన సంవత్సరంలోపే స్థిరమైన జీతం గల ఉద్యోగాలను సంపాదించినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తన నివేదికలో వెల్లడించింది.

గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని నిరుద్యోగులుగా తమను తాము నమోదు చేసుకున్న సంవత్సరం లోపల స్థిరమైన జీతంతో శాశ్వత ఉద్యోగం పొందిన గ్రాడ్యుయేట్లు కేవలం 7 శాతం మంది మాత్రమే ఉన్నారని స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా పేరిట మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం దేశంలో గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత చాలా అధికంగా ఉంది.

15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 40 శాతం, 25 – 29 మధ్య వయసున్న వారిలో 20 శాతం మంది గ్రాడ్యుయేట్‌ నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రాడ్యుయేట్ల జనాభా పెరుగుదల కూడా ఇటీవలి సంవత్సరాల్లో నిరుద్యోగం పెరగడానికి కారణమని నివేదిక పేర్కొంది.  2023 నాటికి దేశంలోని 20 నుంచి 29 మధ్య వయసున్న 6.30 కోట్ల మంది గ్రాడ్యుయేట్లలో 1.10 కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలారని నివేదిక తెలిపింది.

విద్యను కొనసాగించే యువజనుల సంఖ్య 2017లో 38 శాతానికి తగ్గగా 2024 నాటికి అది 34 శాతానికి తగ్గింది. తమ కుటుంబ పోషణ భారం యువజనులపైన పడడమే వారిని విద్యకు దూరం చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.  వీరిలో అధిక శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం చదువును మానేస్తున్నారని స్పష్టం చేసింది. “చాలా మంది యువకులు చదువు మానేయడానికి చెప్పే అత్యంత సాధారణ కారణం కుటుంబాన్ని పోషించడం కోసమే.

2017లో ఈ కారణాన్ని పేర్కొన్న వారి వాటా 58 శాతంగా ఉంది. 2023 నాటికి ఇది 72 శాతానికి పెరిగింది” అని నివేదికలో వెల్లడైంది. ప్రతి సంవత్సరం 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు అదనంగా వస్తుండగా వారిలో కేవలం 28 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభిస్తున్నదని తెలిపింది. ఉద్యోగ మార్కెట్‌లో ప్రవేశ స్థాయిలో గ్రాడ్యుయేట్ల జీతాలు నాన్‌-గ్రాడ్యుయేట్ల జీతాలతో పోలిస్తే రెట్టింపు ఉన్నాయి.