అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో వరుసగా అగ్ర నేతల్ని కోల్పోతున్న ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టెహ్రాన్‌పై రాత్రిపూట జరిపిన వైమానిక దాడిలో తమ బలగాలు ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను హతమార్చాయని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బుధవారం ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ, దానిని ఒక “పిరికిపంద హత్య”గా అభివర్ణించారు.
మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో జరిపిన కాల్పుల్లో ఖతిబ్ మరణించినట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది. ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, నిఘా వ్యవస్థ, గూఢచర్యంతోపాటు ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ దాడుల్లో ఖతిబ్ కీలక పాత్ర పోషించాడు. అణచివేత, తీవ్రవాద కార్యకలాపాల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. మహ్సా అమిని మృతి సందర్భంగా ఇరాన్‌లో జరిగిన నిరసనల సందర్భంగా ఖతిబ్ తీవ్ర అణచివేతకు పాల్పడ్డట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
ఖతిబ్ అయతొల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, సైన్యం టాప్ కమాండర్ గులాం రెజా సాల్మనీ మరణించిన మరుసటి రోజే ఖతిబ్ హతమవ్వడం ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బే. అయితే, ఇరాన్ ప్రభుత్వం “ఒక్క వ్యక్తిపై ఆధారపడదు” అనే విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా గ్రహించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
“అమెరికన్లు, ఇజ్రాయెలీయులు ఈ విషయాన్ని ఇప్పటికీ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో నాకు తెలియదు: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు స్థిరపడిన రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్థలతో కూడిన బలమైన రాజకీయ నిర్మాణం ఉంది. ఒక్క వ్యక్తి ఉండటం లేదా లేకపోవడం ఈ నిర్మాణాన్ని ప్రభావితం చేయదు,” అని విదేశాంగ మంత్రి నొక్కి చెప్పారు.
మరోవైపు ఇరాన్ కీలక నేతల్ని హతమారుస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖట్జ్ తెలిపారు. ఈ విషయంలో సైన్యానికి ప్రధాని నెతన్యాహు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇరాన్ అగ్రనేతల్ని చంపేందుకు ఆదేశించారని చెప్పారు. మరోవైపు దక్షిణ లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మరోవంక, తన దేశంలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులకు ప్రతిగా ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు భీకర హెచ్చరికలు జారీ చేసింది.
సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా మరికొన్ని గంటల్లోనే దాడులు చేయబోతున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా తన మిత్రదేశాల రక్షణకు సిద్ధమైంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ నుండి ఎదురయ్యే ఎలాంటి క్షిపణి దాడులనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

More Stories
రూ.33,600 కోట్లతో పారిశ్రామిక ప్రగతికి ‘భవ్య’ పథకం
పశ్చిమాసియాలో గ్యాస్ క్షేత్రాలపై క్షిపణుల వర్షం
ముస్లింలకు, ఇస్లామిస్టులకు మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలి