లాలూ యాదవ్ పిటీషన్లు తిరస్కరించిన ఢిల్లీ కోర్టు 

లాలూ యాదవ్ పిటీషన్లు తిరస్కరించిన ఢిల్లీ కోర్టు 

ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసు విచారణలో దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణలో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి తమ వాదనల్ని వినిపించడానికి విశ్వసనీయత లేని (విచారణకు ఆధారపడని పత్రాలు) 1,600 పత్రాలు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. 

ఈ పత్రాలను కోరడమంటే ఈ కేసును మరింత క్లిష్టతరం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది. అలాగే విచారణ ప్రారంభంలోనే మరింత చిక్కుముడిగా మార్చడానికే ఈ డాక్యుమెంట్లు రూపొందించబడ్డాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. అయితే ఈ పత్రాలను ఇప్పుడు అందించడం చేస్తే ‘ముందు చేయాల్సిన పనిని తర్వాత చేయడమేనని కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగే తెలిపారు.  న్యాయ ప్రక్రియను కూడా పూర్తి గందరగోళంలోకి నెట్టేయడమేనని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఒక ఆధారపడని పత్రం కోరుతూ లాలూ ప్రసాద్‌ వ్యక్తిగత కార్యదర్శి (పిఎస్‌) ఆర్‌.కె మహాజన్‌ దాఖలు చేసిన దరఖాస్తును, 23 ఆధారపడని పత్రాలు కోరుతూ మాజీ నియామక అధికారి, రైల్వే మాజీ జనరల్‌ మేనేజర్‌ మహీప్‌ కపూర్‌ దాఖలు చేసిన దరఖాస్తులను కూడా ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగే కొట్టేశారు.  కాగా, ఆధారపడని పత్రాలు అంటే దర్యాప్తు సంస్థలచే స్వాధీనం చేసుకున్నప్పటికీ, ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదులో ఆధారంగా పరిగణించబడని పత్రాలు అని అర్థం.