బీజేపీలో  చేరిన అస్సాం కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ 

బీజేపీలో  చేరిన అస్సాం కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ 

అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో బుధవారంనాడు ఢిల్లీలో చేరారు. దీనికి ఒకరోజు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు.  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో బీజేపీలో చేరారు. 

పార్టీలో చేరిన తర్వాత బోర్డోలోయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. రాబోయే ఎన్నికల్లో దిస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్‌పై ఆయన పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  బీజేపీలో చేరిన అనంతరం ప్రద్యుత్ బోర్డోలోయ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని వీడటానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నాచెప్పారు. పార్టీలో తాను ఉక్కిరిబిక్కిరయ్యానని, అవమానాలకు గురయ్యానని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ తనకు చాలా ఇచ్చిందని, అయితే ఆత్మగౌరవం తనకు ముఖ్యమని పేర్కొన్నారు.  లోక్‌సభలో రెండో టర్మ్ పూర్తికావడానికి ఇంకా మూడేళ్లు ఉందని, ఎంపీగానే ఉండాలనుకుంటే అవమానాలను భరించి ఉండేవాడినని, అయితే పార్టీని వీడడానికే తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.  బీజేపీలోకి నాగాన్ ఎంపీ ప్రద్యుత్‌ రాకను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.

1975 నుంచి ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారని, ఆయన రాకతో ఇప్పటికే పటిష్ఠంగా ఉన్న బీజేపీ మరింత బలపడుతుందని తెలిపారు. ఆత్మగౌరవం కావాలనుకున్న వారు కాంగ్రెస్‌లో ఇమడలేరని పేర్కొంటూ మరింత మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి రానున్నారని చెప్పారు. మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా గత నెలలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరగా, తాజాగా ఓ ఎంపీ వైదొలగడం, అస్సాం కాంగ్రెస్ లో లోతుగా పాతుకుపోయిన చీలికలను బట్టబయలు చేసింది.