రూ.33,600 కోట్లతో  పారిశ్రామిక ప్రగతికి ‘భవ్య’ పథకం

రూ.33,600 కోట్లతో  పారిశ్రామిక ప్రగతికి ‘భవ్య’ పథకం
* చిన్నతరహా జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.2,585 కోట్లు
 
కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకాన్ని ఆవిష్కరించింది. రూ 33,600 కోట్ల ఈ పథకానికి  ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం బుధవారం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పారిశ్రామిక వాడలను చేపట్టి, ప్రారంభించేందుకు ఈ పథకం తీసుకువచ్చారు.
 
ప్రత్యేకించి పారిశ్రామిక ప్రపంచ స్థాయి మౌలిక సాధనాసంపత్తి నెలకొల్పేందుకు, ఉత్పత్తి సామర్థం పెంచేందుకు , దేశ ప్రగతి పథం సక్రమ గతికి ఈ పథకం రూపొందించారని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పరిశమ్రలకు అవసరమైన అన్ని అత్యాధునిక మౌలిక సదుపాయాలతో 100 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో 100 ప్రత్యేకపారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్‌ చెప్పారు.
 
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ పార్కుల్లో 15 లక్షల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
ఒక్కో పార్క్‌కు వాటి స్థాయి బట్టి రూ కోటి వరకూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని స్కీం గురించి మంత్రి తెలిపారు.  పారిశ్రామికాభివృద్ధి కోసం దేశంలో ఇప్పటికే అనేక పార్కులున్నాయి. అయితే ఈ పార్కుల్లో భూ కేటాయింపుల వరకే ప్రభుత్వం చేస్తుంది.  యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మిగతా అన్ని అనుమతులు ఆయా సంస్థలే ఆయా శాఖల నుంచి తీసుకోవాలి. 
 
ఈ అనుమతులు పొందడంలో కంపెనీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో పరిశ్రమల ఏర్పాటు ఆలస్యమై ప్రాజెక్టు వ్యయాలు పెరిగిపోతున్నాయి. భవ్య పారిశ్రామిక పార్కుల్లో మాత్రం అన్ని మౌలిక వసతులు, అనుమతులు వెంట వెంటనే అందుబాటులో ఉంటాయి. దీంతో కంపెనీలు వెంటనే తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించవచ్చు. దీంతో దేశ, విదేశీ సంస్థలు ఈ పార్కుల్లో తమ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
 
మరోవంక, దేశంలో జలవిద్యుత్ ఉత్పాదన సంబంధిత చిన్న తరహా హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ స్కీంను రూ 2585 కోట్లతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీం ద్వారా 1500 మైక్రోవాట్స్ మేర పునరుత్థాన ఇంధన ఉత్పత్తి లక్షం ఖరారు చేసుకున్నారు. దేశ పర్యావరణ పరిరక్షణ దిశలో ఈ స్కీంకు ప్రాధాన్యత ఏర్పడింది.
 
ప్రజలు నిర్వాసితులు కాకుండా చేస్తూ, డ్యామ్‌ల నిర్మాణం లేకుండానే నదులపై ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారని మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఒక్కో జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా 1 మైక్రోవాట్ నుంచి 25 మైక్రోవాట్స్ మేర విద్యుత్ ఉత్పాదక సామర్థం ఉంటుంది. ఈ పధకాన్ని ఐదేళ్ల పాటు 203031 ఆర్థిక సంవత్సరం వరకూ అమలు చేస్తారు.  కేంద్ర ప్రభుత్వం పత్తి సేకరణ సామర్థ్యం పెంపుదలకు చర్యలు తీసుకునే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీని మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కు రూ 1,718 కోట్లు కేటాయింపుల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

యుపికి నాలుగులేన్ల రహదారి..హైవే 927 ఉత్తరప్రదేశ్‌కు ఉపయుక్తంగా ఉండేలా రూ 6969 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల జాతీయ రహదారినెంబరు 927 నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రహదారి ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి నుంచి బహరైచ్ వరకూ నిర్మిస్తారు. 101 కిలోమీటర్లకు పైగా ఉండే ఈ రోడ్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, అత్యంత కీలక సంస్థల కేంద్రీకృత ప్రాంతాలకు మరింత రవాణా అనుసంధానత ఏర్పడుతుంది.