వేద మంత్రాలను హేళన చేసిన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి

వేద మంత్రాలను హేళన చేసిన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హిందుత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, వెంటనే అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 153ఎ , 295ఏ తదితర చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం డిమాండ్ చేసింది. 

విహెచ్ పి ప్రాంత ఉపాధ్యక్షులు సునీత రామ్మోహన్ రెడ్డి, ప్రాంత సహా కార్యదర్శి చింతల వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇటీవల ప్రజా వేదిక పై చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా అవమానించే విధంగా ఉండటమే కాకుండా సమాజంలో కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఒకరు ఇలాంటి బాధ్యతారహిత, అనాగరిక, ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు.హిందుత్వం భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మిక విలువల సమాహారం అని పేర్కొంటూ అలాంటి పవిత్రమైన సంప్రదాయాన్ని అవమానించేలా ప్రజా ప్రతినిధి వ్యాఖ్యలు చేయడం కేవలం హిందువుల మనోభావాలను మాత్రమే కాదు, దేశ సమైక్యతను కూడా దెబ్బతీసే చర్యగా భావించాల్సి వస్తుందని వారు ధ్వజమెత్తారు.
ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి సమాజంలో విభేదాలు, ఉద్రిక్తతలు పెరగడానికి కారణమయ్యే ప్రమాదం ఉందని అంతేకాకుండా ఎస్సీ సర్టిఫికెట్ ఆధారంగా రాజ్యాంగపరమైన హక్కులను వినియోగించుకుంటూ రాజకీయ పదవిని పొందిన వ్యక్తి, మరో మత జీవన విధానాన్ని అనుసరిస్తూ హిందూ సంప్రదాయాలను అవమానించేలా మాట్లాడటం సమాజంలో అనవసరమైన వివాదాలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
ప్రజలను ఏకం చేయాల్సిన ప్రజాప్రతినిధి సమాజంలో చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దుమని స్పష్టం చేశారు. సామేల్ చేసిన వ్యాఖ్యల పై తక్షణమే కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా రాజ్యాంగబద్దంగా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించవలసిందిగా కోరారు.