బాధితులైన బిజెపి కార్యకర్తలపై కౌంటర్ కేసులు పెడతారా?

బాధితులైన బిజెపి కార్యకర్తలపై కౌంటర్ కేసులు పెడతారా?

చండూరు మున్సిపాలిటీలో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులతో కలిసి బిజెపి కార్యకర్తలపై హత్యాయత్నానికి  పాల్పడితే పోలీసులు బాధితులైన బిజెపి కార్యకర్తలపై కౌంటర్ కేసులు పడతారా? అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఆరుగురు కార్యకర్తలకు తీవ్ర గాయాలవ్వగా, ప్రస్తుతం నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో చండూరు మున్సిపాలిటీలో బిజెపి తరపున పోటీ చేసిన కిరణ్‌పై రాజకీయ కక్షతో, స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరిగాయని తెలిపారు. బాధితులకు కనీసం ఆసుపత్రిలో సరైన సమయానికి వైద్యం అందకుండా కూడా అడ్డుకోవడం దుర్మార్గం అంటూ విమర్శించారు.  ఇంత తీవ్రమైన ఘటన జరిగినా పోలీసులు నిందితులపై కఠిన సెక్షన్లు పెట్టకుండా, సాధారణ కేసులు నమోదు చేసి సరిపెట్టారని మండిపడ్డారు.

పైగా బాధితులైన బిజెపి కార్యకర్తలపైనే కౌంటర్ కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తుందనడానికి నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై గూండారాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  పెద్దపల్లి, మంచిర్యాల, నల్గొండ వంటి అనేక ప్రాంతాల్లో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ బిజెపి నాయకులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని రామచందర్ రావు విమర్సించారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై ఒక డీఎస్పీ చేయి చేసుకోవడం అత్యంత దారుణం అని తెలిపారు.  కాంగ్రెస్ నాయకులు భూ ఆక్రమణలు, డ్రగ్స్, లిక్కర్, బెల్ట్ షాపుల దందాలను యథేచ్ఛగా నడిపిస్తున్నారని పేర్కొంటూ  పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లు కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు భయపడొద్దని హితవు చెప్పారు. బాధితులకు సరైన వైద్యం అందించాలని కోరుతూ అలాగే ప్రజలు కూడా కాంగ్రెస్ అరాచకాలకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన చెప్పారు.

బిజెపి కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అంటూ పార్టీ మీకు పూర్తి అండగా నిలుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దోషులకు శిక్ష పడి, వారు జైలుకు వెళ్లే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకుల అరాచకాలను గమనిస్తున్నారని,  రాబోయే ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయమని  ధీమా వ్యక్తం చేశారు.