ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో మాట్లాడండి!

ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో మాట్లాడండి!

* ఓ రూపాయికే అంటే జాగ్రత్త… సిపి సజ్జనార్ హెచ్చరిక 

“ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు.” అంటూ మీ మొబైల్‌లో యాడ్స్ వస్తున్నాయా? ఒక్క క్లిక్‌తో మీ జీవితం ప్రమాదంలో పడొచ్చు జాగ్రత్త!  సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.

యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది అని తెలిపారు.  ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని సజ్జనార్ స్పష్టం చేశారు. మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరించారు. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయని తెలిపారు. 

ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ సెక్స్‌టార్షన్ కు దిగుతారని చెప్పారు.  పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించారు. 

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.  ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలని సూచించారు. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని జాగ్రత్తలు చెప్పారు.

రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండని సూచించారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండని సూచించారు. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి చిరునవ్వు నిజం కాదు.. ఒక్క క్లిక్‌తో మీ డబ్బు, పరువు రెండూ పోవచ్చు జాగ్రత్త అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.