నాటో దేశాలపై నిప్పులు చెరిగిన ట్రంప్ 

నాటో దేశాలపై నిప్పులు చెరిగిన ట్రంప్ 
 
పశ్చిమాసియా యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఐరోపా మిత్రదేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రస్తుత పరిస్థితి ‘‘చాలా దారుణంగా’’ ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు.
హర్మూజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ‘‘అందరి కోసం అమెరికా ఒక్కటే కాపలా కాయలేదు. ఈ కీలక మార్గాన్ని తెరిపించేందుకు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపించాలి. నాటో దేశాలు తమ బాధ్యతను నెరవేర్చకుంటే ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే’’ అని ఆయన హెచ్చరించారు. 
 
కూటమిలోని సభ్యదేశంపై బయటి దేశాలేవైనా దాడి చేస్తే అప్పుడు నాటో దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడుతాయని, అదే నాటో దేశమే వేరే దేశంపై యుద్ధానికి దిగితే మిగతా సభ్యదేశాలు కూడా ఆ దేశంతో కలిసి దాడులకు దిగాలనే నిబంధన ఏమీ లేదని పలు నాటో దేశాలు స్పష్టం చేస్తుండడంతో ఓ విధంగా ఇరాన్ పై యుద్ధంలో ఒంటరిగా మిగిలిపోవాల్సి రావడం ట్రంప్ లో అసహనం పెంచుతుంది. దక్షిణ కొరియా మినహా మరేదేశం నుండి సానుకూల స్పందన కన్పించడం లేదు. 

హోర్ముజ్‌ జలసంధిని తెరవడానికి మిత్రదేశాలు సహాయం చేయడంలో విఫలమైతే నాటో కూటమి భవిష్యత్తు చాలా చెడ్డగా ఉంటుందని హెచ్చరించారు. ఇ‘‘నాటో అని మనకి ఒక కూటమి ఉంది. దాని విషయంలో మేం చాలా మంచిగా ప్రవర్తించాం. ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిన అవసరం లేకపోయినా మేం వారికి సాయం చేశాం. ఇప్పుడు వారు (నాటో దేశాలు) మాకు సాయం చేస్తారో లేదో చూస్తాం. మేం వారి కోసం నిలబడతాంగానీ, వారు మాకోసం నిలబడరని నేనెప్పుడో చెప్పాను. ఈసారి కూడా వారు మా కోసం వస్తారని నేను అనుకోవట్లేదు. నాటో దేశాలు అసలు స్పందించకపోయినా.. ప్రతికూలంగా స్పందించినా అది కూటమి భవిష్యత్తుకు చెడు చేస్తుంది’’ అని పేర్కొన్నారు.

 
ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి యూరోపియన్ దేశాలు మొగ్గు చూపకపోవడంతో, అమెరికా, దాని మిత్రదేశాల మధ్య దూరం పెరుగుతోందనే చర్చ మొదలైంది.